ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా ఆ దేశ యువతకు కీలక హెచ్చరిక చేసింది. ఆ దేశంలోని యువతీయువకులు కేవలం ఆ దేశ సంప్రదాయాలనే అనుసరించాలని.. యాస, భాష విషయంలో దక్షిణ కొరియాను అనుసరించకూడదని హెచ్చరించింది. అంతేకాదు.. దక్షిణ కొరియాలో యువత మాదిరిగా హెయిర్ స్టైల్స్ కనిపించినా, పదాలను పలకడంలో దక్షిణ కొరియా యాసను అనుకరించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నార్త్ కొరియా అధికారిక వార్తా పత్రిక స్పష్టం చేసింది. దక్షిణ కొరియా ఫ్యాషన్స్, హెయిర్ స్టైల్స్, మ్యూజిక్‌ను నార్త్ కొరియా యువత ఫాలో కాకూడదని తెలిపింది. కాదని.. ఎవరైనా దక్షిణ కొరియా పద్ధతులను అనుసరిస్తే జైలు శిక్ష తప్పదని ఉత్తర కొరియా ఆ దేశ యువతను హెచ్చరించింది. తుపాకులు చేత పట్టుకున్న శత్రువుల కంటే వారి సిద్ధాంతాలను, సాంప్రదాయాలను ఇక్కడి యువత అనుసరించడం అత్యంత ప్రమాదకరమని ఆ కథనంలో నార్త్ కొరియా అభిప్రాయపడింది. దక్షిణ కొరియాకు చెందిన కె-పాప్ అనే పాపులర్ మ్యూజిక్ ఈ మధ్య ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపుతోంది. దక్షిణ కొరియాకు చెందిన కొందరు యువత గ్రూప్స్‌గా ఏర్పడి కె-పాప్ మ్యూజిక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. నార్త్ కొరియా యువత కూడా ఈ కె-పాప్‌కు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. ఈ పరిణామంపై నార్త్ కొరియా తీవ్రంగా స్పందించింది. కె-పాప్‌ను ‘విష క్యాన్సర్’గా ఉత్తర కొరియా ముద్ర వేసేంత వరకూ పరిస్థితి వెళ్లింది.
అంతేకాదు.. దక్షిణ కొరియాకు సంబంధించిన కంటెంట్‌ను వీక్షిస్తూ పట్టుబడితే 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ఉత్తర కొరియా ఇప్పటికే ఆ దేశ ప్రజలను హెచ్చరించింది. అయితే.. ఈ హెచ్చరికలను కొందరు నార్త్ కొరియా యువత బేఖాతరు చేస్తూ దక్షిణ కొరియా టీవీ డ్రామాలతో పాటు విదేశీ కంటెంట్‌ను కూడా వీక్షిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. ఇతర దేశాలకు చెందిన అన్రిజిస్ట్రడ్ టీవీలు, రేడియోలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వినియోగించడం కూడా నార్త్ కొరియాలో నేరం. గతేడాదే.. నార్త్ కొరియా ఓ నిబంధన తీసుకొచ్చింది. ఉత్తర కొరియాలోని యువత ఎవరైనా దక్షిణ కొరియా యాసలో మాట్లాడినా, అక్కడి వినోదాత్మక వీడియోలను వీక్షిస్తూ పట్టుబడినా వారి తల్లిదండ్రులకు భారీ జరిమానా విధిస్తామని నార్త్ కొరియా పేర్కొంది.
ఈ నిబంధనలపై నార్త్ కొరియన్ స్టడీస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యాంగ్ మూ-జిన్ స్పందిస్తూ.. స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కిమ్‌కు కె-పాప్ లేదా వెస్ట్రన్ కల్చర్ యువతపై ఎంత సులువుగా ప్రభావం చూపుతాయో తెలుసని.. సోషలిస్ట్ సిస్టమ్‌పై ఆ ప్రభావం ప్రతికూలతకు కారణమవుతుందని చెప్పారు. ఈ విషయం తెలిసిన కిమ్.. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా యువతను సక్రమమైన దారిలో పెడుతున్నారని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. యువతపై ఉత్తర కొరియా ఈ తరహా ఆంక్షలు విధించడం ఇదేం కొత్త కాదు. ఉత్తర కొరియాలో ఇటీవల కొన్ని కొత్త చట్టాలకు కిమ్ ఆమోద ముద్ర వేశాడు. ఈ చట్టాల ప్రకారం.. ఆ దేశంలో ఎవరూ జుట్టుకు రంగు వేయకూడదు. 215 రకాల హెయిర్ స్టైల్స్‌తో ఒక లిస్ట్ తయారు చేసిన నార్త్ కొరియా వాటిని మాత్రమే అనుసరించాలని ప్రజలకు సూచించింది. ప్రింటెడ్ టీ షర్టులు, టైట్ జీన్స్ ఉత్తర కొరియాలో ధరించకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kim jong un, North Korea, South korea