Home /News /international /

WORLD ANIMAL DAY 2021 HERE IS THE HISTORY AND SIGNIFICANCE OF MOMNET QUOTES AND WISHES MKS

World Animal Day: నేడు ప్రపంచ జంతు దినోత్సవం.. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, లక్ష్యాలు ఇవే!

నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం

World Animal Day 2021 | ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ ప్రమాణాలను మెరుగుపర్చడం, తద్వారా జంతువులు స్వేచ్ఛగా జీవించేలా పరిస్థితులు కల్పించడమే ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం ప్రధాన లక్ష్యం.

మనతో పాటు భూమ్మీద అనేక రకాల జంతువులు జీవిస్తున్నాయి. వాస్తవానికి మనుషుల కంటే ముందు నుంచే జంతువులు భూమిపై మనుగడ సాగిస్తున్నాయి. అయితే వాటి తర్వాత వచ్చిన మనుషులు మాత్రం జంతువులను వేటాడటంతో పాటు వాటి నివాసాలను సైతం ఆక్రమించుకుంటున్నారు. దీంతో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితులను నిరోధించడమే లక్ష్యంగా ఏటా అక్టోబర్​ 4న ‘ప్రపంచ జంతు దినోత్సవం’ (World Animal Day) నిర్వహిస్తున్నారు. ఈసారి ఈ ప్రపంచ వేడుకలకు బ్రిటన్​లోని నేచర్‌వాచ్ ఫౌండేషన్ అనే జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ నాయకత్వం వహిస్తుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రధాన లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ ప్రమాణాలను మెరుగుపర్చడం, తద్వారా జంతువులు స్వేచ్ఛగా జీవించేలా పరిస్థితులు కల్పించడమే ప్రపంచ జంతు దినోత్సవం ప్రధాన లక్ష్యం. ‘‘ప్రపంచ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతువుల సంక్షేమంపై మనమందరం దృష్టి పెట్టాలి. జాతీయత, మతం, విశ్వాసం లేదా రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా ప్రతి దేశంలోనూ జంతు దినోత్సవాన్ని జరుపుకోవాలి. ప్రజల్లో మరింత అవగాహన పెంచి జంతువులను కూడా మనుషుల్లాగే గుర్తించి వారి సంక్షేమానికి పూర్తి గౌరవం ఇవ్వాలి.” అని ప్రపంచ జంతు దినోత్సవం వెబ్‌సైట్‌ పేర్కొంది.

జంతు దినోత్సవ చరిత్ర

ప్రపంచ జంతు దినోత్సవం 1925లో ప్రారంభమైంది. సైనోలజిస్ట్ హెన్రిచ్ జిమ్మర్‌మాన్ మొదటి కార్యక్రమాన్ని మార్చి 24 న బెర్లిన్‌లోని స్పోర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించారు. తొలిసారి ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా హాజరయ్యారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని జంతువుల సంస్థలను, జంతు ప్రేమికులను ఏకం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

జంతు దినోత్సవ ప్రాముఖ్యత

ప్రపంచ జంతు దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జంతువుల సంరక్షణ పట్ల సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ ప్రాముఖ్యత తెలియజేయడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెట్లు నరికివేయడం, అడవుల విస్తీర్ణం తగ్గడం ద్వారా జంతువులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన జంతు నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం.

ప్రముఖుల సందేశాలు ఇవే

‘‘ఆహారం కోసం, ఆనందం కోసం, సాహసం కోసం, వ్యాపారాల కోసం జంతువులను చంపడం అనేది అసహ్యకరమైన చర్య. అలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు" అని దలైలామా చెప్పారు.

"ఇటీవలి కాలంలో పెంపుడు జంతువుల సంఖ్య పెరుగుతోంది. ఇది మనుషుల్లో వచ్చిన గొప్ప మార్పుగా చెప్పవచ్చు. జంతువుల జీవితాలను సంరక్షించడం తమ బాధ్యతగా ప్రజలు గుర్తించడం చాలా గొప్ప విషయం” అని పేర్కొన్నారు జేమ్స్ క్రోమ్‌వెల్.

"జంతువులను ప్రేమించండి. దేవుడు మీకు మంచి ఆలోచన, ఆనందం ఇస్తాడు." అని చెప్పారు ఫియోడర్ దోస్తోవ్స్‌స్కీ.

‘‘భూమండలంపై సంరక్షకులుగా అన్ని జాతులతో దయ, ప్రేమ, కరుణతో వ్యవహరించడం మన బాధ్యత. మన క్రూరత్వంతో జంతువులను బాధపెట్టడం క్షమించరానిది. దయచేసి వాటి పట్ల శ్రద్ధ చూపండి. వాటి మెరుగైన జీవితానికి సహాయం చేయండి." అంటూ సందేశం ఇచ్చారు రిచర్డ్ గేర్.

"నోరు లేని మూగ జీవాలు మనకు మంచి స్నేహితులు. ఎందుకంటే, అవి మనల్ని ప్రశ్నలు అడగవు. విమర్శలు చేయవు." అని చెప్పారు జార్జ్ ఎలియట్.
Published by:Madhu Kota
First published:

Tags: Animal Lovers, Forest

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు