భర్త చనిపోయిన 14 నెలల తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. తండ్రి లేని లోటు లేకుండా తన కుమారుడిని పెంచుతోంది. అసలు భర్త లేకుండా ఇదెలా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. భద్రపరిచిన పిండం ద్వారా ఆమె తన బిడ్డకు జన్మనిచ్చింది. అమెరికాలోని ఓక్లహామాలో ఈ ఘటన జరిగింది. సారా షెలెన్ బెర్గర్ అనే మహిళకు 2018 సెప్టెంబర్‌లో స్కాట్ (41)తో వివాహం జరిగింది. స్కాట్ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో కాలేజీలో పాఠాలు చెబుతుండగా స్కాట్‌కు గుండెపోటు వచ్చింది. భవిష్యత్‌లో ఏమైనా జరగవచ్చని ఊహించి.. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ జంట. భద్రపరిచిన పిండాల (embryo fertilisation) ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. స్కాట్ నుంచి వీర్యం, సారా నుంచి అండాలను సేకరించి.. ఫలదీకరణ చేసి పిండంగా మార్చారు. ఆ పిండాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిచారు.
ఈ ప్రక్రియను పూర్తిచేశాక.. స్కాట్‌కు మరోసారి గుండెపోటు రావడంతో మరణించాడు. తన భర్త మరణించిన 6 నెలల తర్వాత సారా షెలెబన్ బెర్గర్ బార్బడోస్‌కు వెళ్లి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (embryo transfer) చేయించుకుంది. భద్రపరిచిన పిండాలను ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఆ మరుసటి వారమే ఆమె గర్భం దాల్చింది. నవ మాసాలు మోసిన తర్వాత ఈ ఏడాది మే నెలలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కుమారుడే లోకంగా.. అతడిలోనే భర్తను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ పద్ధతిలో మరో పిండం భద్రపరిచి ఉందని సారా తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
''మేం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు స్కాట్ మరణించారు. భద్రపరిచిన పిండాల ద్వార మగబిడ్డను కన్నాను. బాబు పుట్టిన తర్వాత నా జీవితానికి ఒక అర్థం లభించింది. నా మనసు సంతృప్తి చెందింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది. నా పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా’' అని సారా పేర్కొన్నారు.
సారా, స్కాట్ సదరన్ నజరీన్ యూనివర్సిటీలో చదువుకునే సమయలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2018 సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఏడాదిన్నరకే స్కాట్ కన్నుమూశారు. అమెరికాలో IVF ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె బార్బడోస్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇలా కృత్రిమ పద్దతిలో బిడ్డకు జన్మనిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, International, International news, Us news