దుబాయ్: భర్తకు తెలియకుండా అతని ఫోన్‌లో డేటాను చూసి వ్యక్తిగత స్వేచ్ఛ హరించినందుకు భార్య పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చిన ఘటన దుబాయ్‌లో వెలుగుచూసింది. దీంతో ఆ అరబ్ మహిళ భర్తకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఏఈకి చెందిన ఓ వ్యక్తి తన పరువుకు భార్య భంగం కలిగించిందని, తనను అవమానించి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందని ‘రస్ అల్ ఖైమా’ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాదు.. ఈ కేసు పని మీద తిరుగుతుండటం వల్ల తాను ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి వేతనాన్ని కోల్పోయానని, అటార్నీ ఫీజులు కూడా తనకు అదనపు ఖర్చులని చెప్పాడు. అంతేకాకుండా తాను మానసికంగా కూడా ఒత్తిడికి లోనయ్యానని సదరు భర్త వాపోయాడు. అయితే.. భార్య తరపు న్యాయవాది కూడా ఆమె తరపున వాదనలు వినిపించారు. తన క్లయింట్‌ను ఆమె భర్త దుర్భాషలాడి, తిట్టికొట్టి ఇంటి నుంచి పంపించేశాడని.. దీంతో ఆమె తన కూతురితో సహా నడిరోడ్డున పరిస్థితి ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే.. ఇరు పక్షాల వాదనలు విన్న సివిల్ కోర్టు భర్త వ్యక్తిగత స్వేచ్ఛకు భార్య భంగం కలిగించినట్లు తేల్చింది.
తన భర్త ఫోన్‌ను అతనికి తెలియకుండా చూసిన భార్య అతని ఫోన్‌లో ఉన్న ఫొటోలను, వాయిస్ రికార్డ్స్‌ను అతని కుటుంబానికి పంపి అతని పరువు తీసినట్లు ఆధారాలు కూడా ఉండటంతో కోర్టు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆమెను ఆదేశించింది. 5,400 ధీరమ్స్.. మన కరెన్సీలో లక్ష రూపాయల నష్టపరిహారాన్ని భర్తకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. తనకు జరిగిన నష్టానికి నష్టపరిహారంతో పాటు తాను కోల్పోయిన వేతనానికి సమానమైన మొత్తాన్ని కూడా ఆమె వద్ద నుంచి ఇప్పించాలని కోర్టును ఆ భర్త కోరినప్పటికీ సివిల్ కోర్టు అందుకు నిరాకరించింది.
లక్ష రూపాయల నష్టపరిహారంతో పాటు ఈ కేసులో భాగంగా భర్తకు ఖర్చయిన న్యాయపరమైన ఫీజులను, ఖర్చులను కూడా అతని భార్య చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల.. ఓ కేసులో టెక్ట్స్ మెసేజ్‌లు పంపి ఓ మహిళ మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ యూఏఈకి చెందిన యువకుడిని సదరు మహిళకు 20,000 ధీరమ్స్(భారత కరెన్సీలో రూ.3.5 లక్షలు) పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.