తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్ అన్నారు. అమెరికాలో వివక్షకు తావులేదని మరోసారి స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్య దినోత్సవమన్న జో బైడెన్.. ప్రస్తుతం అమెరికా ఓ మహమ్మారితో పాటు చీలిపోయిన రాజకీయాలతో పోరాడుతోందని అన్నారు. అంతా కలిసికట్టుగా ఉంటేనే వీటిని అధిగమించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. మాటల చెప్పడానికి మించి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని బైడెన్ అన్నారు. అమెరికా ప్రపంచంలోని శాంతి, భద్రతకు నమ్మకమైన నేస్తంగా ఉండాలని సూచించారు. వాస్తవాలను వక్రీకరించే పద్ధతికి దేశం స్వస్తి చెప్పాలని కోరారు. తనకంటే ముందు అమెరికాను పరిపాలించిన అధ్యక్షులందరికీ బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత తీవ్రవాదం, జాతి అహంకారాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని జో బైడెన్ అన్నారు. అమెరికన్లు ఎప్పుడూ ఓడిపోలేదని.. అంతా కలిసి పని చేస్తే సవాళ్లను జయించడం పెద్ద విషయం కాదని అన్నారు.
అమెరికా ఇప్పటికే అనేక అవరోధాలను అధిగమించిందని బైడెన్ గుర్తు చేశారు. మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉందని తెలిపారు. హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కరోనా వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, 4 లక్షల మందిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మనం ఒడిపోలేదని, ఇప్పుడు అమెరికా చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైందని బైడెన్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. బైడెన్ కంటే ముందే వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ ప్రమాణం చేశారు. కరోనా నిబంధనల కారణంగా కేవలం వెయ్యిమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా , బిల్ క్లింటన్ , జార్జ్‌బుష్ ఈ వేడుకకు వచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇక కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ హిల్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:January 20, 2021, 23:03 IST