WIFE SUE HER HUSBAND COMPANY EMPLOYER FOR SPREADING CORONA IN THEIR HOME IN CALIFORNIA HSN
ప్రపంచంలోనే వింత కేసు.. భర్త పనిచేసే కంపెనీపై కేసు పెట్టిన భార్య.. మాకు కరోనా రావడానికి మీరే కారణమంటూ..
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు ఒకటి నమోదయింది. ఓ కుటంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న క్లారిటీతో ఆ భార్య ఉంది. అందుకే కోర్టు మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదు చేసింది ఎవరిపైనంటే..
కుటుంబంలో ఒక్కరికి కరోనా సోకితే చాలు, భార్యా పిల్లలందరూ బాధితులుగా మారిన ఘటనలు చూశాం. ఒక్క కరోనా సోకిన వ్యక్తి పెళ్లికి హాజరై పదుల సంఖ్యలో అతిథులకు కరోనా అంటించిన వార్తలను చదివే ఉంటారు. ఓ అపార్ట్మెంట్ లో పార్టీ జరిగిన పార్టీ వల్ల వందకు పైగా కరోనా కేసులు నమోదైన కథనాలూ చూసే ఉంటారు. ఈ ఘటనల్లో ఎవరూ ఎవరినీ నిందించడానికి వీల్లేని పరిస్థితి. ఎవరి వల్ల కరోనా అందరికీ వ్యాప్తి చెందిందో అస్సలు చెప్పలేని స్థితి. అందుకే బాధితులంతా తమ మానాన తాము ట్రీట్ మెంట్ తీసుకుంటుంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు ఒకటి నమోదయింది. ఓ కుటంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న క్లారిటీతో ఆ భార్య ఉంది. అందుకే కోర్టు మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదు చేసింది భర్తపై కాకపోవడమే ఇక్కడ విచిత్రం.
కాలిఫోర్నియాలో రాబర్ట్ కుసీంబా అనే వ్యక్తి 65 ఏళ్ల వ్యక్తి విక్టరీ ఉడ్ వర్క్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతేడాది జూలై 16న అతడికి, అతడి భార్య కోర్బీ కుసీంబాకు కరోనా సోకింది. ఇద్దరూ వెంటిలేటర్ పై ఉండి మరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అదృష్టవశాత్తు బయటపడగలిగారు. అయితే రాబర్ట్ భార్య కోర్బీ ఈ ఘటనపై సీరియస్ అయింది. తన భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా భర్తకు కరోనా రావడానికి కారణం అతడు పనిచేసే కంపెనీయేనన్న ఆరోపణలు చేస్తోంది. సరైన వర్క్ ప్లేస్ ను కల్పించకుండా, ఆఫీసులో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే తన భర్తకు కరోనా సోకిందనీ, అతడి ద్వారా తనకు కూడా వ్యాప్తి చెందిందన్న ఆరోపణలతో ఆగస్టు నెలాఖరులో కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను అతి త్వరలోనే యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మక్సైన్ ఎం.చెస్నీ విచారించనున్నారు.
తన భర్త ప్రాజెక్ట్ సైట్ నుంచి తిరిగొచ్చిన కొద్ది రోజులకే తామిద్దరం కరోనా బారిన పడ్డామని కోర్బీ వాదిస్తోంది. అక్కడ జరిగిన పొరపాట్ల వల్లే తాము బాధితులుగా మారాల్సి వచ్చిందని చెబుతోంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అయితే ఈ తరహా పిటిషన్ రావడం ఇదే మొదటిసారి అని కాలిఫోర్నియా న్యాయ కోవిధులు చెబుతున్నారు. ఒక వేళ జడ్జి కనుక ఈ పిటిషన్ ను తిరస్కరించకపోతే ఆమె తరపు లాయర్ ఓ సవాల్ ను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. కంపెనీ ఆపీసులోనే అతడికి కరోనా సోకందన్నదానికి ఆధారాలను లాయర్ సమర్పించాల్సి ఉంటుందనీ, అది ఎలా సాధ్యం చేస్తారో చూడాలని అంటున్నారు. మరి న్యాయమూర్తి చెస్నీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.