రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) పై నాలుగు నెలలుగా యుద్ధం(War) చేస్తున్నా పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకోవడంలో విఫలమైంది. ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నా మిగతా ప్రాంతాలపై బలగాలు ముందుకెళ్లడం కష్టంగా మారింది. అనూహ్యంగా ఉక్రెయిన్ తమ బలగాలతో పోరాడుతుండటంతో రష్యా వెనకడుగు వేస్తోంది.
ఉక్రెయిన్ పై పట్టు సడలుతోందా..?
లుహాన్స్క్‌ను స్వాధీనం చేసుకోవడంలో కొంత విజయాన్నిసాధించినా.. పూర్తి స్థాయి యుద్ధానికి తగినంత దళాలు లేని కారణంగా రష్యా వెనకడగు వేస్తోంది. మాజీ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి ఇగోర్ గిర్కిన్ మార్షియల్ లా ప్రవేశపెట్టాలని, పూర్తి లేదా పాక్షిక సమీకరణను ప్రారంభించాలని పుతిన్‌ను కోరాడని సమాచారం. సైన్యాన్ని పూర్తిస్థాయిలో విస్తరించాలని, మరింత వేగంగా ఉక్రెయిన్ పై దాడులు చేయాలని ఆయన సూచించారు. అయితే యుద్ధ నిపుణులు, విశ్లేషకులు మాత్రం మార్చిలో కీవ్‌ను చుట్టుముట్టడంలో రష్యా విఫలమవడానికి తగినంత సంఖ్యలో దళాలు లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఇదే కీవ్, సుమీ, చెర్నిహివ్ ఒబ్లాస్ట్‌ల నుంచి రష్యన్ దళాలు ఉపసంహరణకు కారణమని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని జరిగినా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం సైనిక సమీకరణ చేపట్టడానికి అయిష్టంగా ఉన్నారని విశ్లేషకులు తెలిపారు.
యుద్ధం మధ్యలో సైనిక సమీకరణకు రష్యా సిద్ధంగా ఉందా?
యుద్ధంలో రష్యా సైనికులు భారీ స్థాయిలో మరణించారని ఉక్రెయిన్ తెలుపుతోంది. సైనికులతో పాటు భారీ స్థాయిలో ఆయుధాలు, సామగ్రిని రష్యా కోల్పోవాల్సి వచ్చింది. ఈ స్థితిలో సైనిక సమీకరణ చేయడంలో రష్యా భయపడి ఉండొచ్చని నిపుణులు తెలిపారు. తమ దేశ సైన్యాధికారులు యుద్ధదాన్నిసమర్థవంతంగా నడపలేక పోతున్నారని పుతిన్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లో రష్యాకు 200,000 మంది రష్యన్ దళాలు, ప్రాక్సీలు ఉన్నట్లు అంచనా. అయితే మే నెలలో ఉక్రెయిన్ వద్ద 700,000 మంది సైనికులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఈ దశలో రష్యా భారీగా దళాలను పెంచుకొనే అవకాశం ఉందని ఉక్రెయిన్ ఆందోళన చెందుతోంది.
* పుతిన్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా?
అసలు ఉక్రెయిన్ పై యుద్ధం వద్దని రష్యాలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేశారు. మెజార్టీ ప్రజలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సైనిక సమీకరణ చేపడితే దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని పుతిన్ భయపడ్డారని సమాచారం. అంటే కాదు సైనిక సమీకరణ చేపడితే తమ పదవికి గండం ఏర్పడ వచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్ననందున ఈ విషయంలో వెనకడగు వేయొచ్చు.
యుద్ధంలో రష్యాకు ఎదురు దెబ్బ తగిలిందా..?
యూరోపియన్ యూనియన్ దేశాల యుద్ధ వాహనాలు, భారీగా డబ్బు సాయం అందడంతో ఉక్రెయిన్ ఇన్ని రోజులుగా రష్యాను నిలువరిస్తోందనడంలో సందేహం లేదు. తమకున్న చిన్నపాటి సైన్యంతో పోరాట పటిమ చూపి ఆదేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. ఫలితంగా చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా తుపాకి పట్టుకున్నారు. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 36000 మంది రష్యన్ సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ తెలిపినా రష్యా ప్రాణ నష్టంపై స్పష్టత ఇవ్వలేదు. యుద్ధంలో రష్యాకు చెందిన ఓ బెటాలియన్ కమాండర్ ఆండ్రియొ కొలెస్నికొవ్ ను మట్టుబెట్టామని చెప్పింది. ఈ విషయంలో రష్యాకు పెద్ద దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.
డాన్‌బాస్‌లో పుతిన్ బలగాలు సాధించగలవా.. ?
ఉక్రెయిన్ లో కీలక ప్రాంతమైన డాన్‌బాస్‌లో రెండు దేశాలు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాంతమై పై చేయి సాధించడానికి ఎత్తుకు ఎత్తులు వేస్తూ తీవ్రస్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. డాన్‌బాస్‌లోని పెద్ద ప్రాంతాలను చుట్టుముట్టడానికి రష్యన్ కమాండర్లు వేర్పాటువాదులతో కలిసి ముందుకు వెళ్తున్నారు. భారీస్థాయిలో మోటార్ల షెల్స్ తో విరుచుక పడుతూ ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి వెళ్లేలా చేస్తున్నాయి. మొత్తం డాన్‌బాస్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటే, దక్షిణాన పట్టు సాధించి, నల్ల సముద్రం నుంచి ఉక్రెయిన్‌ను దూరం చేసే అవకాశం ఉందని యుద్ధ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే యూరోపియన్ యూనియన్ సహకారంతో రష్యా ను దీటుగా ఎదుర్కోవాలని ఉక్రెయిన్ ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War, Vladimir Putin, War, Zelensky