అమెరికాలో విదేశీ వలసకు బ్రేక్.. భారతీయులపై ప్రభావమెంత..?

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయులపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది టెకీల భవితవ్యంమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

news18-telugu
Updated: April 23, 2020, 4:38 PM IST
అమెరికాలో విదేశీ వలసకు బ్రేక్.. భారతీయులపై ప్రభావమెంత..?
డొనాల్డ్ ట్రంప్
  • Share this:
కరోనా విలయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి విదేశీ వలసపై 60 రోజుల పాటు నిషేధం విధించారు. వలసదారీ విధానాన్ని (immigration policy) తాత్కాలికంగా రద్దుచేస్తూ పరిపాలనా పరమైన ఆదేశంపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలో అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా నిలిపివేశారు. కరోనా కష్టకాలంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఐతే ఇప్పటికే శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డు) పొందిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయులపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది టెకీల భవితవ్యంమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతానికి ఇమ్మిగ్రెంట్ వీసాలపైనే తాత్కాలిక నిషేధం ఉంటుంది. EB2, EB3 ఈ కోవలోకి వస్తాయి. ఈ వీసాల ద్వారా గ్రీన్ కార్డు పొందాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లినట్లు భావించాలి. అంటే అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందాలనుకునే వారిపై మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. ఐతే ఇప్పటికే అన్ని దేశాలు అంతర్జాతీయ విమానాలను రద్దుచేశాయి. అమెరికా సైతం సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రెంట్ వీసాలపై 60 రోజులు నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. చాలా తక్కువ మందిపై మాత్రమే ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఎలాంటి నిషేధం లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలంటే.. అమెరికాలోకి ఇతర దేశాల పౌరులను తాత్కాలికంగా అనుమతిచ్చే వీసాలు. పర్యాటకం, వ్యాపారం, విద్య, తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతిచ్చే వీసాలు నాన్ ఇమ్మిగ్రెంట్ కిందకు వస్తాయి. H1B వీసాలు కూడా ఈ కేటగిరిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో పనిచేసే భారతీయ సాప్ట్ వేర్ ఇంజినీర్లకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నది నిపుణుల అభిప్రాయం.

అమెరికా జారీచేసే H1B వీసాల్లో ఎక్కువ మంది భారతీయులే పొందుతున్నారు. 2018లో నాలుగింట మూడొంతుల వీసాలు భారతీయ టెకీలే దక్కించుకున్నారు. ఆ ఏడాది ఏకంగా 309,986 H1B వీసాలు మనోళ్లకే వచ్చాయని అమెరికా గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఐతే ఇమ్మిగ్రెంట్ వీసాలపై 60 రోజుల పాటు నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్.. నాన్ ఇమ్రిగ్రెంట్ వీసా విధానాన్ని కూడా సమీక్షించాలని యోచిస్తున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపైనా నిషేధం విధిస్తే మాత్రం.. భారతీయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ అలాంటి నిర్ణయం తీసుకుంటే మనోళ్లంతా తట్టాబుట్టా సర్దుకొని రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: April 23, 2020, 4:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading