పుల్వామా ఉగ్రదాడికి భారత్ వైమానిక సేనలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాల్ని మెరుపు దాడులతో నేలమట్టం చేశాయి. పాక్ ఎదురు దాడికి దికితే రెండు దేశాల మధ్యా యుద్ధం రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటి మాత్రం క్లియర్... అణ్వాయుధాలను వాడకుండా యుద్ధం జరిగితే... పాకిస్థాన్ ఏ విధంగానూ గెలిచే అవకాశాలు లేవు. అణ్వాయుధాలు వాడితే... గెలుపు సంగతేమోగానీ... రెండు దేశాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు. అది ఏ ఒక్కరమూ కోరుకునేది కాదు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగితే తప్ప... ఉగ్రవాదాన్ని అడ్డుకోలేమన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతల్లో చాలా మంది యుద్ధమొక్కటే మార్గం అన్నట్లుగా సంకేతాలిస్తున్నారు. మరి పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగితే ప్రపంచంలో ఏ దేశాలు భారత్ వైపు నిలుస్తాయి... ఏ దేశాలు పాకిస్థాన్ వైపు మళ్లుతాయి...
ఇజ్రాయెల్ : మొదటి నుంచీ ఇజ్రాయెల్ భారత్‌వైపే ఉంది. యుద్ధం వస్తే భారత్‌కి ఎలాంటి షరతులూ లేకుండా మద్దతిస్తామనీ, ఎంతటి సాయమైనా చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీయే. అందువల్ల ఆ దేశంతో మన సంబంధాలు మరింత పెరిగాయి. దానికి తోడు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచీ భారత్ పెద్ద మొత్తంలో ఆయుధాలు కొంటోంది. అందువల్ల సహజంగానే ఆ దేశం మనకు సపోర్ట్ ఇస్తోంది.
అమెరికా : ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమైనదో అమెరికాకు తెలుసు. ఉగ్రవాది బిన్ లాడెన్‌ను పట్టుకున్నది పాకిస్థాన్‌లోనే. అందువల్ల యుద్ధం వస్తే అమెరికా భారత్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది అమెరికా-భారత్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు. రెండోది అమెరికాకు వ్యతిరేకంగా చైనా పాకిస్థాన్‌కు మద్దతివ్వడం.
బ్రిటన్ : అమెరికా మిత్రదేశమైన బ్రిటన్... అమెరికాను ఫాలో అవుతోంది. యుద్ధం విషయంలోనూ అంతే. ఇదివరకు ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల సమయంలోనూ అమెరికాతో కలిసి యుద్ధం చేసిన బ్రిటన్... ఈసారి కూడా అగ్రరాజ్యం వెంటే నడుస్తూ... భారత్‌కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి.
చైనా : పాకిస్థాన్‌తో కలిసి సిల్క్ రోడ్ నిర్మిస్తున్న చైనా... యుద్ధం వస్తే పాకిస్థాన్‌కి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం ఖాయం. కారణం భారత్ ఎంతలా చతికిలపడితే... ఆసియాలో తాను అంతలా బలపడవచ్చన్నదే డ్రాగన్ దేశం ప్లాన్. యుద్ధం రావాలన్నదే చైనా ఆశ. ఎందుకంటే యుద్ధం వస్తే కచ్చితంగా భారత్, పాక్ రెండు దేశాలూ ఎంతో కొంత నష్టపోతాయిగా.
రష్యా : స్వాతంత్ర్యం తర్వాత అమెరికా కంటే ఎక్కువగా దగ్గరైన మిత్ర దేశం రష్యా. ప్రస్తుతం మనకు అమెరికా దగ్గరవ్వడంతో రష్యా కాస్త దూరం జరిగింది. అంతమాత్రాన ఈ దేశం పాకిస్థాన్‌కి మద్దతిచ్చే అవకాశాలు లేవు. భారత్‌కి మద్దతివ్వడమో లేదంటే తటస్థంగా ఉండటమో చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే అమెరికా మద్దతిచ్చే పరిస్థితి ఉన్నప్పుడు రష్యా ముందుకు వచ్చే అవకాశాలు తక్కువ.
సౌదీ అరేబియా : మొన్ననే సౌదీ యువరాజు సల్మాన్ పాకిస్థాన్‌లో పర్యటించి ఆ దేశాన్ని ఆకాశానికి ఎత్తేశారు. లక్షల కోట్ల డీల్స్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌కో మత పరంగా దగ్గరవుతున్న సౌదీ... యుద్ధం వస్తే ఆ దేశానికే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.
ఫ్రాన్స్ : భారత్‌తో ఎన్నో ఆయుధ ఒప్పందాలు ముఖ్యంగా రాఫెల్ డీల్ వంటివి కుదుర్చుకుంటున్న ఫ్రాన్స్... ఇండియాకి చిరకాల మిత్ర దేశం. అందువల్ల యుద్ధం వస్తే, ఫ్రాన్స్ మద్దతు భారత్‌కే ఉంటుంది.
ఇరాన్ : ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. కారణం ఈమధ్య ఇరాన్లో జరిగిన ఉగ్ర దాడికి కారణం పాకిస్థానే అని ఇరాన్ ఆరోపించింది. పైకా ఇరాన్ నుంచీ భారత్ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల భారత్ వైపు మొగ్గే అవకాశాలున్నాయి. ఐతే... భారత్‌కి తనను శత్రువుగా భావించే అమెరికా సపోర్ట్ ఉందన్న కారణంతో తటస్థంగా ఉండే అవకాశాలూ ఉన్నాయి.
బంగ్లాదేశ్ : భారత్‌వైపే నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు భారత్ యుద్ధమే చేసింది. అదీ కాక, బంగ్లా ప్రధాని షేక్ హసీనాకి భారత్‌తో సత్సంబంధాలు మెండుగా ఉన్నాయి. ఐతే... ఆ దేశంలోని అతివాద వర్గాలు స్వరం పెంచితే మాత్రం షేక్ హసీనా తటస్థంగా ఉండే అవకాశాలున్నాయి.
జపాన్, ఆసియా దేశాలు : చైనాను వ్యతిరేకించే జపాన్... కచ్చితంగా భారత్ వైపు నిలవడం ఖాయం. జపాన్‌తో ఇండియాకి బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి. సహజంగానే ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే తూర్పు ఆసియా దేశాలు భారత్ వైపు నిలిచే పరిస్థితి ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ : పాకిస్థాన్ పొరుగు దేశమైన ఆప్ఘనిస్థాన్ మొదటి నుంచీ ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కొంటూనే ఉంది. పైగా ఆ దేశానికి భారత్ ఆర్థికంగా ఎంతో సాయం చేస్తోంది. అందువల్ల ఆప్ఘాన్ ప్రభుత్వం భారత్‌కి సపోర్ట్ చేసినా... భారత్‌కి కలిసొచ్చేదేమీ ఉండదు. పాకిస్థాన్ వైపు మొగ్గినా... భారత్‌కి వచ్చే నష్టమూ ఏమీ ఉండదు.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ప్రపంచాన్ని ప్రభావితం చేసే చాలా దేశాలు భారీ ఎత్తున ఆయుధ వ్యాపారం చేస్తున్నాయి. అవి పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. దేశాల మధ్య చిచ్చుపెట్టి రెండు దేశాలకూ ఆయుధాల్ని అమ్ముకుంటున్నాయి. అవి పైకి ఉగ్రవాదాన్ని అణచేయాలి అంటూనే మరోవైపు దేశాల మధ్య యుద్ధాలు జరిగేలా ప్రోత్సహిస్తుంటాయి. అందువల్ల భారత్, పాకిస్థాన్ లాంటి దేశాలు యుద్ధాల వల్ల కలిగే నష్టాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. సమస్యలపై దృష్టి సారించుకోవాలే తప్ప... యుద్ధాలు చేసి కొత్త సమస్యలు తెచ్చుకోవడం వృథాయే. ఎందుకంటే యుద్ధంలో గెలిచేది భారతే... కానీ నష్టపోయేది రెండు దేశాలూ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, France, India, India-China, Jammu and Kashmir, Pakistan, Pulwama Terror Attack, US-China, USA