China Second Bridge in Pangong Tso : గత రెండేళ్లుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాలూ అనేక దఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపి కొన్ని ప్రాంతాల నుంచి సైన్యాలను వెనక్కు మళ్లించాయి. అయితే పూర్తిస్థాయిలో మాత్రం ఉపసంహరణ జరగలేదు. ఇదే సమయంలో చైనా మరోసారి భారీ కుట్రకు తెరలేపింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా తన సైనిక కార్యకలాపాలను ఉద్ధృతంగా కొనసాగిస్తోంది. పాంగాంగ్ సరస్సుపై ఇప్పటికే ఒక వంతెన నిర్మించిన చైనా మరో వారధికి శ్రీకారం చుట్టింది. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలను కలిపేలా గతేడాది చివర్లో వంతెన నిర్మాణం ప్రారంభించి ఇటీవలే పూర్తిచేసిన చైనా... తాజాగా దీనికి సమాంతరంగా భారీ సైనిక వాహనాలు, దళాలను వేగంగా తరలించేందుకు కొత్తగా వంతెన నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖకు 20కిలోమీటర్లకుపైగా దూరంలో పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భారీ క్రేన్లు, ఇతర సామాగ్రి తరలింపు కోసం ఇటీవల నిర్మించిన వంతెనను ఉపయోగించుకోనుంది.
వంతెన నిర్మాణానికి సంబంధించి శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి. శాటిలైట్ చిత్రాలతోపాటు అక్కడి పరిణామాలు తెలిసినవారు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఎల్ఏసీ వెంట చైనీస్ కార్యకలాపాలను ట్రాక్ చేసే జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్.. కొత్త వంతెన నిర్మాణం ఉపగ్రహ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మొదటి వంతెనకు సమాంతరంగా కొత్తగా పెద్ద వంతెన నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సరస్సుపై నుంచి భారీగా మిలిటరీ కార్యకలాపాలు సాగించటమే లక్ష్యంగా కొత్త వంతెన నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. సైమన్ ఉపగ్రహచిత్రాల ప్రకారం రెండువైపుల నుంచి ఏకకాలంలో వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణంతో లోతైన రుడోక్ ప్రాంతం నుంచి పాంగాంగ్ సరస్సులోని ఎల్ఏసీ పరిసర ప్రాంతాల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. 2020 ఆగస్టులో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో డ్రాగన్ బలగాలు అడ్డుకోవడం వల్ల భారత సైన్యం దక్షిణ తీరంలో అనేక వ్యూహాత్మక శిఖర ప్రాంతాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చైనా తన సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది.
ALSO READ Vastu Tips : లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి,డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి
తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథస్థితిని మార్చేందుకు 2020లో చైనా ప్రయత్నించింది. ఈ క్రమంలో భారత్-చైనా సైనికులు గల్వాన్ లోయ వద్ద ఘర్షణపడ్డారు. అదే ఏడాది ఆగస్టులో పాంగాంగ్ దక్షిణ భాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను భారత సైన్యం చేజిక్కించుకుంది. ఈ హఠార్పరిణామంతో కంగుతిన్న చైనా..మరోసారి అలాంటి పరిస్థితే వస్తే సమర్ధంగా ఎదుర్కొనేలా బలగాలను వేగంగా తరలించేందుకు వీలుగా సరస్సుపై ప్రి ఫాబ్రికేటెడ్ వారధిని నిర్మించింది. దీంతో పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఖుర్నాక్ నుంచి దక్షిణ తీరంలో రుటోక్ మధ్య దూరం భారీగా తగ్గింది. గతంలో ఖుర్నాక్ నుంచి రుటోక్కు చేరుకోడానికి చైనా సైన్యం దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ, వంతెన అందుబాటులోకి రావడంతో అది 40 నుంచి 50 కిలోమీటర్లకు పడిపోయింది. తాజాగా, మరో వంతెనతో భారీ స్థాయిలో సైన్యాలను అత్యంత వేగంగా దక్షిణ భాగానికి తరలించే అవకాశం చైనాకు ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వతాలపై పట్టుసాధించడం భవిష్యత్తులో భారత్‌కు కష్టమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ALSO READ Right to dignity : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు..కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
ఇక, వాస్తవాధీన రేఖ సమీపంలోని పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణంపై భారత్ స్పందించింది. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన ఆ దేశ ఆక్రమిత ప్రాంతంలో ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడ చాలా సంవత్సరాలుగా చైనా నిర్మాణాలు చేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అది సైనికపరమైన అంశం అని తెలిపారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయని, అందుకు ప్రయత్నాలు చేస్తుంటామని వివరించారు. ద్వైపాక్షిక, సైనిక మార్గాల్లో చర్చలు జరుగుతాయని అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను రక్షణశాఖ ఇస్తుందని తెలిపారు.
ALSO READ Russia-Ukraine War : పెద్ద సంఖ్యలో రష్యాకు లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికులు..ఇక యుద్ధం ముగిసినట్లేనా!
మరోవైపు, ప్రభుత్వ స్పందనపై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ ధోరణి పాటిస్తోందని ఆరోపించింది. నామమాత్రంగా, భయంతో కూడిన స్పందన ఇచ్చిందంటూ విదేశాంగ శాఖపై మండిపడింది. భారత ప్రాదేశిక సమగ్రతను చైనా ఉల్లంఘిస్తూనే ఉందని, మోదీ ప్రభుత్వం మాత్రం భారత భూభాగాన్ని డ్రాగన్‌కు అప్పగిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.