హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China elephants: అలసట లేదు.. నిద్ర రాదు.. ఏనుగుల మహా పాదయాత్ర!

China elephants: అలసట లేదు.. నిద్ర రాదు.. ఏనుగుల మహా పాదయాత్ర!

China’s wandering elephants

China’s wandering elephants

అడవి నుంచి బయలుదేరినప్పుడు ఈ గుంపులో మొత్తం 16 ఏనుగులు ఉన్నాయి. కానీ వాటిలో రెండు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.

చైనాలోని ఒక ఏనుగుల మంద ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని రోజులుగా 15 ఏనుగులు గమ్యం లేకుండా వలస వెళ్తున్నాయి. యునాన్ ప్రావిన్స్‌లోని వన్యప్రాణుల అభయారణ్యంలో ఇవి జీవించేవి. కానీ గత ఏడాది ఇవి అడవిని వీడాయి. అడవి నుంచి ఇప్పటి వరకు 500 కిలోమీటర్ల (300 మైళ్లు) మేర ప్రయాణం సాగించాయి. ప్రస్తుతం యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ శివార్లకు చేరుకున్నాయి. వీటి ప్రయాణం గురించి తెలుసుకున్న అధికారులు, ఏనుగుల గమనాన్ని ట్రాక్ చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే వివరాలను వారు గుర్తిస్తున్నారు. ఒక డజనుకు పైగా డ్రోన్‌లతో నిఘా పెట్టారు. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం వీబోలో.. ఈ ఏనుగుల వార్తలు ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. మందలోని అన్ని ఏనుగులు ఒకచోట నిద్రపోతున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

అడవి నుంచి బయలుదేరినప్పుడు ఈ గుంపులో మొత్తం 16 ఏనుగులు ఉన్నాయి. కానీ వాటిలో రెండు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. అయితే ఈ ప్రయాణంలోనే ఒక ఏనుగు ప్రసవించింది. దీంతో మందలోని మొత్తం జంతువుల సంఖ్య 15కు చేరుకుంది. మూడు పెద్ద మగ ఏనుగులు, ఆరు ఆడ ఏనుగులు, ఆరు చిన్నవి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఏనుగుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కానీ ఇవి సుమారు పది లక్షల డాలర్లకు పైగా పంట నష్టం కలిగించాయి. వాటి మార్గంలో ఉండే పంటపొలాలపై దాడులు చేస్తూ ముందుకు కొనసాగుతున్నాయి. అయితే ప్రజలకు, పంటలకు ఏర్పడే నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

* ఎక్కడికి వెళ్తున్నాయి?

అసలు ఈ ఏనుగులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ ప్రయాణానికి వాటిని ప్రేరేపించిన కారణం ఏంటనేది మిస్టరీగా మిగిలిపోయింది. మొక్కజొన్న, ఉష్ణమండల ప్రాంతాల్లో లభించే పండ్లు, ఇతర రుచికరమైన పంటలను వెతుక్కుంటూ వెళ్లవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మందకు నాయకత్వం వహించే ఏనుగుకు సరైన అనుభవం లేక ఇలా దారితప్పి వెళ్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. చైనాలో ఏనుగుల సంఖ్యను క్రమంగా పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లో చేస్తోంది. ఈ క్రమంలో అడవుల నుంచి బయటకు వచ్చే ఏనుగులకు అధికారులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులకు ఎలాంటి హాని కలిగించవద్దని సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. టపాసులు కాల్చడం, ఇతర మార్గాల ద్వారా వాటిని భయపెట్టడం.. వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

* మార్గం మళ్లించడమే లక్ష్యం

ఏనుగుల మందను నిలువరించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోకి రాకుండా, రోడ్లపై భారీ ట్రక్కులను నిలుపుతున్నారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాటికి ఈ మంద కున్మింగ్ శివార్లలోనే ఉంది. ఈ రాజధాని నగరంలో సుమారు 70 లక్షల మంది నివసిస్తున్నారు. ఇవి నగరంలోకి ప్రవేశిస్తే, పరిస్థితులు చేజారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మందను పర్యవేక్షించడానికి సోమవారం 410 మంది అత్యవసర సిబ్బంది, పోలీసులతో ఒక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక వాహనాలు, 14 డ్రోన్ల సాయంతో వాటిపై నిఘా ఉంచారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ఏనుగులు ఇష్టంగా తినే ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని అడవుల్లోకి వాటిని పంపించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

First published:

Tags: China, Elephant

ఉత్తమ కథలు