USA Scientists: అణుశక్తి గురించి చాలామందికి తెలిసిందే.. అణువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా పుట్టే శక్తిని విద్యుత్‌గా మార్చుకుంటాం. అయితే ఆకాశంలో ఉండే నక్షత్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియే జరుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే పూర్తిగా దానికి వ్యతిరేకమైన పద్ధతిలో ఉంటుందంటున్నారు. అంటే ఇక్కడ అణువులు విడిపోవు. విపరీతమైన వేడి, ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంటాయి. దీన్నే కేంద్రక సంలీన ప్రక్రియ అని పిలుస్తుంటారు. అలా చేయడంతో కోతల్లేని, కాలుష్యం ఊసే లేని, అత్యంత చౌకకే విద్యుత్ ను అందరికీ అందించే అవకాశం ఉంటుంది. నిజంగా అదే జరిగితే అద్భుతమే. కానీ మరి అది వీలవుతుందా..? అన్నది మరికొన్ని రోజుల తరువాత క్లారిటీ వస్తుంది. సూర్యుడిలో జరిగే సర్వసాధరణ తంతును భూమ్మీద కృత్రిమంగా సృష్టిస్తే చాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్నప్రయత్నాల్లో ఇటీవలే ఓ మేలి మలుపు చోటుచేసుకుంది. నక్షత్ర శక్తిని మనకు మరింత దగ్గర చేసింది!
ఇప్పటికే ఈ ప్రక్రియను భూమ్మీద కృత్రిమంగా సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అమెరికాలోని లారెన్స్ లివర్‌మూర్ నేషనల్ లేబొరేటరీలో గత నెల 8న ఈ ప్రయోగాల్లో తొలిసారి ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలిగారు. 192 లేజర్ కిరణాలను ఉపయోగించి కొన్ని మిల్లీమీటర్ల సైజున్న ఇంధనాన్ని బాగా వేడెక్కించగా లేజర్ కిరణాల కోసం ఖర్చు పెట్టిన శక్తి కంటే 1.3 మెగాజౌళ్ల శక్తి అదనంగా పుట్టింది. కిలో ముడిచమురు ద్వారా పుట్టే శక్తిలో ఇది మూడు శాతం!
కేంద్రక సంలీన ప్రక్రియను సాధించేందుకు ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో అనుసరించిన ఇనర్షియల్ కన్‌ఫైన్మెంట్ కాగా.. అయస్కాంతాల సాయంతో ప్లాస్మాను నియంత్రించేది ఇంకోటి. ఇనర్షియల్ కన్‌ఫైన్మెంట్‌లో శక్తిమంతమైన లేజర్లను అతితక్కువ కాలం ప్రయోగిస్తారు. ఇది సంలీన ప్రక్రియను మొదలుపెడుతుంది. శక్తిమంతమైన లేజర్లు, ఇతర టెక్నాలజీలు అందుబాటులో లేని కారణంగా ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు రెండో పద్ధతిపైనే ఎక్కువ ఆధారపడేవారు.
ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీలో 192 లేజర్ కిరణాలను గది మధ్యలో ఉంచిన మిలీమీటర్ల సైజున్న లోహంపై పడేలా చేసినప్పుడు ఎక్స్‌రే కిరణాలు వెలువడి లోహం వేడెక్కుతుంది. అదే సమయంలో ఇంధనాన్ని పీడనానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో ఉపయోగించిన దానికంటే ఎక్కువ శక్తి పుట్టినప్పటికీ వాణిజ్యస్థాయిలో విద్యుదుత్పత్తికి ఇది సరిపోదు. ఉపయోగించిన ఇంధనం కంటే కనీసం వంద రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.
ఫ్యూజన్ ప్రయోగాల కోసం ఇటీవలి కాలంలో నిధుల వరద పారుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఇంకో 20 ఏళ్లలో వాణిజ్యస్థాయి విద్యుదుత్పత్తి సాధ్యమని నమ్ముతున్న కొందరు ఇప్పటివరకూ సుమారు 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు పెడుతున్న ఖర్చుకు ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఫ్యూజన్ రియాక్టర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వీరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం ఈ ఫ్యూజన్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పట్టడం గ్యారంటీ. అన్నీ సవ్యంగా సాగితే 2060 నాటికి ప్రపంచ విద్యుత్ అవసరాల్లో ఒకశాతం ఫ్యూజన్ రియాక్టర్ల ద్వారా అందవచ్చునని ఒక అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Scientist, USA, World news