US TELUGU COMMUNITY TEXAS GOVERNOR ANNOUNCED APRIL 2 UGADI AS TELUGU LANGUAGE AND HERITAGE DAY SK
Texas Telugu Community: అమెరికాలో తెలుగు వారికి ప్రత్యేక గౌరవం.. ఏప్రిల్ 2న తెలుగు భాషా వారసత్వ దినం
టెక్సాస్ గవర్నర్‌తో ప్రసాద్ తోటకూర
Texas Telugu Community: టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు.
డాలస్, టెక్సాస్: అమెరికాలో తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఏప్రిల్ 2ని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించింది టెక్సాస్ స్టేట్. శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా.. ఏప్రిల్ 2, 2022వ తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ప్రకటించారు. ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు గవర్నర్ అబ్బాట్ ఆ అధికారిక ప్రకటన ప్రతిని అందజేశారు.
టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయమని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని. వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు టెక్సాస్ గవర్నర్.
డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “టెక్సాస్ రాష్ట్రంలో ఎంతోకాలంగా నివసిస్తున్న తెలుగు వారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతూ టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తన శ్రీమతి సిసీలియా తో కలసి తెలుగు వారి ముఖ్యమైన పండుగ ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి. తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందులకు టెక్సాస్ రాష్ట్ర తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకండించడం పట్ల టెక్సాస్‌లో ఉండే తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.