అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పేట్రేగింది. విస్కాన్సిన్ స్టేట్లోని మిల్వాకీ సిటీలో ఓ దుండగుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. మాల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలోకి చొరబడి సిబ్బందిపై విచక్షిణా రహితంతా కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా దళాలు రంగంలోకి దిగి దుండగుడి పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఐతే అంతలోనే అతడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఈ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు. కాల్పుల సమయంలో ఆఫీసులో వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసింది.
ఇక నిందితుడిని గతంలో ఇదే కంపెనీలో పనిచేసిన 51 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే అతడిని విధుల నుంచి తొలగించారు. ఐతే అతడు ఎందుకు దాడి చేశాడన్నది తెలియాల్సి ఉంది. ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో.. మాల్సన్ కూర్స్ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకే దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై మాట్లాడిన మిల్వాకీ మేయర్ టామ్ బారెట్ మాట్లాడుతూ.. మిల్వాకీ నగరానికి ఇవాళ చీకటి రోజని అన్నారు. కాల్పుల నేపథ్యంలో మిల్వాకీలో మాల్సన్ కూర్స్ బీర్ల కంపెనీకి సమీపంలో ఉండే స్కూలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు.
Published by:Shiva Kumar Addula
First published:February 27, 2020, 07:39 IST