హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US: 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచిన అమెరికా -విదేశీ ప్రయాణాలకు అనుమతి -భారతీయులకు ఊరట

US: 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచిన అమెరికా -విదేశీ ప్రయాణాలకు అనుమతి -భారతీయులకు ఊరట

విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా

విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా విదేశీ ప్రయాణికుల పై ఉన్న నిషేధాన్ని సోమవారం నుంచి ఎత్తేసింది. కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు షరతులు విధించింది. అమెరికాలో పనిచేస్తూ కొవిడ్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి దెబ్బకు అన్నీ మూసుకున్న అగ్రరాజ్యం అమెరికా మళ్లీ 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచింది. విదేశీ ప్రయాణికుల పై ఉన్న నిషేధాన్ని సోమవారం నుంచి ఎత్తేస్తున్నట్లు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు షరతులు విధించింది. ఈ మేరకు విదేశీ ప్రయాణాలపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా అమెరికాలో పనిచేస్తోన్న చాలా మంది భారతీయులు ఇక్కడే చిక్కుకుపోయిన నేపథ్యంలో తాజా నిర్ణయం మనవాళ్లకు ఊరటనివ్వనుంది.

కొవిడ్ కారణంగా అమెరికా గత ఏడాదిన్నరగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2020లో అప్పటి ట్రంప్ సర్కారు జారీ చేసిన నిషేదాన్ని బైడెన్ సర్కారు కూడా కొనసాగించింది. అయితే, ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖంపట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై అమెరికా ఆంక్షలను సడలించింది. ఇవాళ్టి నుంచి(అక్టోబర్ 8 నుంచి) భూతల, వాయు మార్గాల్లో వచ్చే ప్రయాణికులను అనుమతిస్తామని, అయితే, కొవిడ్ టీకాలు తీసుకున్నవారు, కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవాళ్లనే దేశంలోకి అనుమతిస్తామని అమెరికా పేర్కొంది.

ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు పూర్తిగా రెండు డోసులు టీకా తీసుకున్న వారికే అనుమతిస్తామన్న బైడెన్ సర్కారు.. కొన్ని సడలింపులు సైతం ప్రకటించింది. జనాభాలో 10 శాతం కంటే తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, అలాంటి వారికి మానవీయ కోణంలో అనుమతిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

టీకాలు తీసుకోని విదేశీ ప్రయాణికుల విషయంలో విమానయాన సంస్థలకు అమెరికా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకుండా ప్రయాణికుల్ని అమెరికాకు తీసుకొస్తే ఆ సంస్థకు 35వేల డాలర్ల జరిమానా విధిస్తారు. రోడ్డు, జల మార్గాల్లో వచ్చే ప్రయాణికులు సైతం తప్పనిసరిగా టీకాలు తీసుకుని ఉండాల్సిందేనని అమెరికా సర్కారు తెలిపింది. కాగా, సరిహద్దులు తెరుస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయులకు ఊరటనిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కొవిడ్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయులు ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమమం అయింది.

First published:

Tags: America, Covid -19 pandemic, Joe Biden, Passengers, Travel ban, USA

ఉత్తమ కథలు