US POLLS 2020 JOE BIDEN WINS IN MICHIGAN AND ARIZONA LIVE UPDATES HERE MS
US ELECTIONS 2020: మిచిగానూ ముంచే..! అరిజోనా వద్దనే..!! ఇక ట్రంప్ కథ కంచికే..
డొనాల్డ్ ట్రంప్.. (ఫైల్)
గడిచిన 24 గంటల్లో నూవ్వానేనా అన్నట్టు సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విజేత ఎవరో తేలిపోయింది. విజయం నాదేనని విర్రవీగిన ట్రంప్ కథ ఇక కంచికే..
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జో బైడెన్ చివరికి.. లేటు వయసులోనైనా తన కోరిక తీర్చుకోనున్నాడు. అమెరికా 45 వ అధ్యక్ష పీఠం పై ఆయన అడుగిడే సమయం ఆసన్నమైంది. యూఎస్ ఎన్నికలలో ఆయన విజయం ఖరారైంది. మెజారిటీ సాధించేందుకు ఆయన సాధించాల్సిన 270 ఎలక్ట్రోరల్ ఓట్లలో ఇప్పటికే 264 ఓట్లు సాధించారు. ఇక విజయానికి ఆరు అడుగులు మాత్రమే మిగిలిఉన్నాయి. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే విన్నంగ్ షాట్ సిక్సర్ కొడితే మ్యాచ్ బిడెన్ దే.
బుధవారం రాత్రి నాటికి అమెరికాలో 44 రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవగా అందులో జో బైడెన్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే మిగిలిన ఆరు రాష్ట్రాల ఎన్నికలలోనూ ఆయన పైచేయి సాధించారు. రిపబ్లికన్ల తో పాటు డొనాల్ట్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మిచిగాన్ ఆయనను నిండా ముంచింది. రిపబ్లికన్ ఓట్లకు పెట్టని కోటగా ఉన్న అరిజోనా ఓటర్లు కూడా ట్రంప్ ను సాగనంపారు. మిచిగాన్ లో బైడెన్ కే స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. అక్కడ ఆయన 16 ఎలక్ట్రోరల్ ఓట్లను గెలుచుకున్నారు.
ఎలక్ట్రోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ బైడెన్ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు కౌంట్ అయిన ఓట్లలో బైడెన్ కు 7 కోట్ల 19 లక్షల ఓట్లురాగా.. ట్రంప్ 6 కోట్ల 85 లక్షల ఓట్లను మాత్రమే సంపాదించాడు. ఇరువురి మధ్య సుమారు కోటి ఓట్లపైగానే తేడాఉంది. అయితే ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నందున బైడెన్ కు ఆధిక్యం మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేగాక గతంలో బరాక్ ఒబామా సాధించిన ఓట్ల కంటే బైడెన్ కే ఎక్కువ ఓట్లు పోలవ్వడం గమనార్హం. గడిచిన వందేళ్లలో ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైన నేపథ్యంలో.. బైడెన్ ఘన విజయం దిశగా దూసుకుపోతున్నారు. కాగా స్వింగ్ రాష్ట్రాల్లోనూ కింగ్ అనిపించుకున్న ట్రంప్.. చివరికి నిర్ణయాత్మక రాష్ట్రాలలో మాత్రం తేలిపోయారు.
మరోవైపు కౌంటింగ్ కొనసాగుతున్నా.. ఓటమి అంచున ఉన్నా.. ట్రంప్ మాత్రం ఆయన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని.. దానిపై తనకు అనుమానం ఉందంటూ ఆయన అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఒకవైపు ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నా.. తానే గెలిచానని పాత పాటే పాడుతున్నారు. పూర్తి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆయన ఇంకెన్ని విన్యాసాలు చేస్తాడో మరి..!
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.