Joe Biden: తొలి రోజే బైడెన్ దూకుడు.. కీలక ఆదేశాలపై సంతకాలు.. ట్రంప్‌కు షాక్

Joe Biden: తొలి రోజే బైడెన్ దూకుడు.. కీలక ఆదేశాలపై సంతకాలు.. ట్రంప్‌కు షాక్

(Image Credit: AP)

Joe Biden: కొత్త అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు షాకిస్తూ, ఆయన గతంలో ఇచ్చిన పలు కీలక ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.

  • Share this:
    అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకాలు చేశారు. తన పాలనలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముస్లిం దేశాలపై బ్యాన్ నుంచి WHO నుంచి తప్పుకోవడం వరకు.. ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఐనా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను చేయదలచుకొని చేశారు. ఐతే కొత్త అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు షాకిస్తూ, ఆయన ఇచ్చిన పలు కీలక ఆదేశాలనువెనక్కి తీసుకున్నారు.

    తొలి రోజు జో బైడెన్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

    అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా కట్టడికి సంబంధించి జో బైడెన్ చర్యలు చేపట్టారు. అందరూ వంద రోజుల పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా ఆయన ఛాలెంజ్‌ విసిరారు. కరోనా స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందించేలా ‘కొవిడ్‌-19 రెస్పాన్స్‌ కోఆర్డినేటర్‌’ పోస్టును సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికాను డొనాల్డ్ ట్రంప్‌ తప్పించిన విషయం తెలిసిందే. ఐతే ఆ నిర్ణయాన్ని జో బైడెన్ నిలిపివేశారు. వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌసీ నేతృత్వంలోని అమెరికా బృందం WHO సమావేశాలకు ప్రాతినిధ్యం వహించనుంది.

    డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని తిరగరాస్తూ మళ్లీ ప్యారిస్ ఒప్పదంలో చేరుతున్నట్లు జో బైడెన్ ప్రకటించారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామ్యం చేస్తూ సంతకం చేశారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితికి అమెరికా అడ్మినిస్ట్రేషన్ లేఖరాయనుంది. మరో నెల రోజుల్లో పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి భాగస్వామిగా ఉండబోతోంది.



    ముస్లిం దేశాల నుంచి అమెరికాకు రాకపోకలపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని జో బైడెన్‌ ఎత్తివేశారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

    అమెరికా- మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణాన్ని ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అక్రమ వలసలను అడ్డుకట్ట వేసేందుకే గోడను కడుతున్నట్లు ఆయన చెప్పారు. అందుకోసం నిధుల సమీకరణకు నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ తీసుకొచ్చారు. దానిని తాజాగా జో బైడెన్ నిలిపివేశారు.

    గ్రీన్ కార్డుల విషయంలోనూ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపసంహరించారు.

    బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం నేపథ్యంలో జాతి వివక్ష నిర్మూలన దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు జో బైడెన్. బ్లాక్‌, లాటినో, నేటివ్‌, ఏషియన్‌, పసిఫిక్‌ ద్వీపాల, ఎల్‌జీబీటీక్యూ, మతపరమైన మైనార్టీ వ్యక్తులకు సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా బైడెన్‌ సంతకం చేశారు.

    చిన్న తనంలోనే అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడిన వారికి కొత్త ప్రభుత్వ శుభవార్త చెప్పింది. బాల్యంలో అమెరికాకు వలస వచ్చి.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వం కల్పించేలా జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ట్రంప్‌కు షాకిచ్చాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: