మేక వేట కోసం రూ.80 లక్షలు కట్టాడు...ఈ కిక్కుకో లెక్కుంది

కేవలం కొందరికి మాత్రమే వేట అనుమతి ఉంటుంది. అందుకోసం పెషావర్ వైల్డ్ లైఫ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక వేలం నిర్వహిస్తారు. ఎక్కువ పర్మిట్ ఫీజు చెల్లించే నలుగురిని ఎంపిక చేసి..వారికి మాత్రమే వేట అనుమతి ఇస్తారు.

news18-telugu
Updated: February 6, 2019, 7:02 PM IST
మేక వేట కోసం రూ.80 లక్షలు కట్టాడు...ఈ కిక్కుకో లెక్కుంది
మార్ఖోర్ మేకతో బ్రయాన్ హర్లాన్
news18-telugu
Updated: February 6, 2019, 7:02 PM IST
సాధారణంగా మాంసం కోసమో లేదంటే డబ్బుల కోసమో జంతువులను వేటాడుతారు. కానీ ఇతడు మాత్రం వేట కోసమే డబ్బులు చెల్లించాడు. అది కూడా ఏ వందో..వెయ్యో కాదు..! ఏకంగా రూ.80 లక్షల డబ్బుకట్టి మేకను వేటాడాడు. వేట అతడి సరదా మాత్రమే కాదు..జీవితం..! వేట కోసం ఎందాకైనా వెళ్తాడు..ఎన్ని దేశాలైనా తిరుగుతాడు..ఎంత డబ్బైనా ఖర్చుపెడతాడు. అతడే బ్రయాన్ కిన్సెల్ హర్లాన్..! అమెరికాలో పేరు మోసిన ప్రొఫెషనల్ హంటర్..! హర్లాన్ ఇంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించింది దేని కోసమే తెలుసా..? పాకిస్తాన్ జాతీయ జంతువైన మార్ఖోర్ మేక కోసం..!

మార్ఖోర్..మన భాషలో చెప్పాలంటే అడవి మేక. జడల్లాంటి వెంట్రుకలు, మెలికలు తిరిగిన కొమ్ములతో అందంగా ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలోని హిమాలయ ప్రాంతాలు, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్‌లో కనిపిస్తాయి. పాకిస్తాన్ జాతీయ జంతువు కావడంతో అక్కడ మార్ఖోర్‌ల వేట నిషిద్ధం. అంతరించిపోతున్న జంతు జాతుల్లో మార్ఖోర్ కూడా ఉంది. అందుకే వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంతర్జాతీయ సంస్థలు కూడా మార్ఖోర్ మేకల సంరక్షణకు నడుం బిగించాయి. మరి నిషేధం ఉన్నప్పటికీ మార్ఖోర్ మేకను యూఎస్ హంటర్ ఎలా వేటాడాడో తెలుసా..? దానికీ ఓ చరిత్ర ఉంది. అందులోనూ బలమైన ఓ కారణం ఉంది.

పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా హంటింగ్ ట్రోఫీ జరుగుతుంది. ఈ ట్రోఫీలో ప్రపంచం నలుమూలల నుంచి పేరుమోసిన వేటగాళ్లు పాల్గొంటారు. ఐతే అందులో కేవలం కొందరికి మాత్రమే వేట అనుమతి ఉంటుంది. అందుకోసం పెషావర్ వైల్డ్ లైఫ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక వేలం నిర్వహిస్తారు. ఎక్కువ పర్మిట్ ఫీజు చెల్లించే నలుగురిని ఎంపిక చేసి..వారికి మాత్రమే వేట అనుమతి ఇస్తారు.
.

ఈసారి హంటింగ్ ట్రోఫీలో పాల్గొన్న హర్లాన్..వేలంలో ఏకంగా 1,10,000 డాలర్లు (దాదాపు రూ.80లక్షలు) చెల్లించాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర. ఆ తర్వాతి స్థానంలో అమెరికన్ హంటర్ డియాండ క్రిస్టోఫర్ (1,05,000 డాలర్లు), జాన్ అమిస్టోసో (1,00,00 డాలర్లు) ఉన్నారు. క్రిస్టోఫర్, అమిస్టోసో జనవరి 21నే చెరో రెండు మేకలను వేటాడారు. ఇక తాజాగా హర్లాన్ సైతం గిల్గిట్-బల్తిస్తాన్‌లో సాసీ గ్రామంలో మార్ఖోర్‌ని వేటాడి చంపాడు.హంటింగ్ ట్రోఫీ వెనక మంచి ఉద్దేశముంది. ఈ ట్రోఫీ ద్వారా వచ్చిన డబ్బులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది అక్కడి ప్రభుత్వం. గిల్గిట్-బల్తిస్తాన్‌లో మార్ఖోర్ మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ప్రాంతం కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీ నుంచి వచ్చిన మొత్తాన్ని గిల్గిట్ బల్తిస్తాన్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. కొంత మొత్తాన్ని మార్ఖోర్ మేకల సంరక్షణకు కేటాయిస్తారు. తద్వారా మార్ఖోర్‌ల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది.

First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...