హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తాం..జో బైడెన్ హామీ

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తాం..జో బైడెన్ హామీ

జో బైడెన్, కమలా హారిస్

జో బైడెన్, కమలా హారిస్

US Elections 2020 | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అమెరికాలోని ప్రవాస భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్‌ పేరును ఖరారు చేయడం తెలిసిందే.

ఇంకా చదవండి ...

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అమెరికాలోని ప్రవాస భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్‌ పేరును ఖరారు చేయడం తెలిసిందే. తాజాగా భారతీయ ఓటర్లను ఆకర్షించేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.  తాము అధికారంలోకి వస్తే భారత్‌-అమెరికాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టంచేశారు. నేరుగా చైనా పేరును ప్రస్తావించకుండా...ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రాంతీయ, సరిహద్దు సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ దేశానికి తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల క్రితం భారత్‌-అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం ఆమోదం పొందే విషయంలో తాను ప్రత్యేక చొరవ చూపినట్లు గుర్తు చేశారు. భారత్-అమెరికాల మధ్య మంచి స్నేహితులు, భాగస్వాములు అయితే యావత్ ప్రపంచం సురక్షితం అవుతుందని వ్యాఖ్యానించారు.

వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్య భద్రత విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని బైడెన్ ఆకాంక్షించారు. భిన్నత్వం అమెరికా, భారత్ బలాలుగా పేర్కొన్న బిడెన్...ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తన టీమ్‌లో ప్రవాస భారతీయులు ఎక్కువ మంది పనిచేస్తున్నారని చెప్పారు. ఒబామా యంత్రాంగంలో అమెరికా చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భారత సంతతి వ్యక్తులకు ప్రాధాన్యత కల్పించినట్లు..నాటి ఒబామా పాలనలో ఉపాధ్యక్షుడిగా సేవలందించిన బిడెన్ పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ పేరును ఇటీవల బిడెన్ ఖరారు చేయడం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన...అమెరికా చరిత్రలో తొలిసారిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాబోతున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3న జరగనుండగా...ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జో బైడెన్ తలపడుతున్నారు.

First published:

Tags: Independence Day 2020, Joe Biden, Kamala Harris, US Elections 2020

ఉత్తమ కథలు