హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Elections: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ట్రంప్ ఇంటికే

US Elections: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ట్రంప్ ఇంటికే

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైెడెన్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ పెద్దన్నగా పిలిచే అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

  అమెరికాకు కొత్త అధ్యక్షుడు రానున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపు లాంఛనమైంది. అమెరికా అధ్యక్షుడు కావడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను జో బైడెన్ సాధించారు. సీఎన్ఎన్ న్యూస్ చానల్ తెలిపిన వివరాల ప్రకారం జో బైడెన్‌కు ఇప్పటి వరకు 273 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపు తర్వాత బైడెన్‌ ఖాతాలో 20 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అధ్యక్ష పీఠానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270ని దాటారు.  ఇక జో బైడెన్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టడం లాంఛనమే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రకటించిన తర్వాత జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించడమే తరువాయి. జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు కానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయమైంది. 2020లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రావడానికి ముందు జో బైడెన్ ఒబామా హయాంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతేకాదు. డెలావర్‌లో అత్యంత సుదీర్ఘకాలం సేవలు అందించిన సెనేటర్‌గా కూడా 77 సంవత్సరాల బైడెన్ నిలిచారు. ట్రంప్ హయాంలో అమెరికా అత్యంత దురావస్థకు చేరుకుందని బైడెన్ ఆరోపించారు. తన ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ విధానాల మీద విరుచుకుపడ్డారు.

  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు తెలిసిన వెంటనే జో బైడెన్ స్పందించారు. అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అమెరికా. గ్రేట్ కంట్రీకి లీడర్‌గా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. మనముందున్న పని కష్టమైందే. కానీ, నేను ఒక్కటి మాత్ర ప్రమాణం చేస్తున్నా. నేను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిని. మీరు నాకు ఓటు వేసినా. వేయకపోయినా. మీరు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.’ అని బైడెన్ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

  జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో ఇక కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కావడం లాంఛనమే. ఈ ఎన్నికల్లో గెలవడంతో ఆమె మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలు, మొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళా ఉపాధ్యక్షురాలు కాబోతున్నారు. కమలాహారిస్ తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్.

  అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపు ఖాయమైన తర్వాత కమలాహారిస్ స్పందించారు. ‘ఈ ఎన్నికలు కేవలం జో బైడెన్, నా గురించి కాదు. ఇది అమెరికా అత్మ గురించి. దీని కోసం ఫైట్ చేస్తాం. మా ముందు చాలా పని ఉంది. ప్రారంభిద్దాం.’ అంటూ ట్వీట్ చేశారు.

  అమెరికాలో ఒక వ్యక్తి రెండు సార్లు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పుకోవాల్సిందే. సహజంగా తొలిసారి గెలిచి ఎన్నికైన వ్యక్తికే రెండోసారి కూడా చాన్స్ ఇస్తారు అమెరికన్లు. కానీ, అప్పుడప్పుడు కొందరు అధ్యక్షుడు మొదటిసారి 4 ఏళ్ల పాలన తర్వాత ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో 11వ వ్యక్తిగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Donald trump, Joe Biden, Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు