అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు. చాలా ముఖ్యమైన, నిర్ణయాత్మకమైన రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అవి ఎప్పటికి వస్తాయా అని ఒక్క అమెరికానే కాదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంకా ఫలితాలు రాకముందే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఇద్దరూ తామే గెలిచామంటూ ప్రకటించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల మీద ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా కొన్ని ఓట్లు జోడించారని, దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి ఇంకా ఎన్ని న్యాయపరమైన, రాజకీయపరమైన డ్రామాలు కనిపిస్తాయనేది చూడాలి.
ఎన్నికలు వివాదాస్పదం అయితే, ఏం జరగొచ్చు?
న్యాయపరమైన అంశాలు
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ముందస్తు ఓటింగ్ డేటాను పరిశీలిస్తే రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్లు ఎక్కువ మంది మెయిల్ ద్వారా ఓటు వేశారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ లాంటి రాష్ట్రాలు ఎన్నికల రోజు పూర్తయ్యే వరకు మెయిల్ ఓట్లను లెక్కించవు. ఆయా రాష్ట్రాల్లో తొలిదశ ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. అక్కడ కేవలం బ్యాలెట్ ఓట్లను మాత్రమే లెక్కించారు. మెయిల్ ఓట్లను ఇంకా లెక్కించుకుండానే ట్రంప్ గెలిచినట్టు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. కీలకమైన రాష్ట్రాల్లో హోరాహోరీ ఫలితాలు వస్తే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద వ్యక్తులు, సంస్థలు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. అలా వివిధ రాష్ట్రాల్లో నమోదయ్యే కోర్టు కేసులన్నీ కలిపి అమెరికన్ సుప్రీంకోర్టుకు చేరతాయి.
2000 సంవత్సరంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఫ్లోరిడాలో అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ తన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ మీద 537 ఓట్లతో గెలిచారు. దీనిపై వివాదం చెలరేగింది. రీ కౌంటింగ్‌ను హైకోర్టు నిలిపివేసింది. ‘చట్టం సరిగా పనిచేయాలి. అందుకే మేం అమెరికా సుప్రీంకోర్టకు వెళ్తున్నాం. ఓటింగ్ మొత్తం నిలిపివేయాలి.’ అని ట్రంప్ బుధవారం వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు పాపులర్ ఓటు ద్వారా ఎన్నికవ్వరు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 538 ఎలక్టోరల్ ఓట్లలో (దీన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ) మెజారిటీ ఓట్లు సాధించిన వారు వైట్ హౌస్‌లో అడుగు పెడతారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు పాపులర్ ఓట్ లభించింది. కానీ, ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీ ఓట్లు సాధించారు.
ఒకవేళ ఎవరికీ మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లు రాకపోతే (ఇద్దరికీ 269-269 ఎలక్టోరల్ ఓట్లు వస్తే) అప్పుడు ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. సెనేట్ వైస్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. ప్రతినిధుల సభలో ప్రతి రాష్ట్రానికి ఒక ఓటు ఉంటుంది. ప్రస్తుతం 50లో రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు 26 మంది ఉన్నారు. డెమొక్రాట్లు 22 మంది ఉన్నారు. ఒకవేళ న్యాయపరంగా అయినా, రాజకీయ పరంగా అయినా సరే ఈ ప్రక్రియ 2021 జనవరి 20వ లోపు పూర్తి చేయాలి. ఒకవేళ అప్పటికీ పూర్తి కాకపోతే స్పీకర్ ఆఫ్ ద హౌస్ యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ నేత నాన్సీ పెలోసీ ప్రస్తుతం ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఉన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.