వాషింగ్టన్: సరిగ్గా మరో 15 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. జనవరి 20న జరగబోయే అధ్యక్ష పదవీ బాధ్యతల బదలాయింపు ప్రక్రియ సజావుగా జరిగే సూచనలు అగ్రరాజ్యంలో కనిపించడం లేదు. జార్జియా రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రఫెన్స్ పెర్జర్కు ఆదివారం ట్రంప్ ఫోన్ చేసి ఎన్నికల ఫలితాన్ని మార్చే ప్రయత్నాలు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేప్ సోమవారం వెలుగులోకి వచ్చింది. అది కాస్తా ప్రస్తుతం అమెరికాలో సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలకు కూడా కాకముందే అగ్రరాజ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపిస్తున్న జార్జియా రాష్ట్రంలో ఓ ప్రధాన అధికారి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జార్జియా నార్తెన్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ అటార్నీ అయిన బ్యూంగ్ బజయ్ పక్ తన పదవికి రాజీనామా చేశారు. జార్జియా రాష్ట్ర ఎన్నికల నిర్వహణాధికారి బ్రాడ్ రఫెన్స్ పెర్జర్తో మాట్లాడిన ఆడియో టేప్ బయటపడిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై అగ్రరాజ్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా తన రాజీనామాకు బ్యూంగ్ బజయ్ పక్, కారణాలను ఏమీ తెలపకపోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ట్రంప్ ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని మీడియా కోడై కూస్తోంది. ఈ ఆడియో కాల్ వ్యవహారంపై బయటపడటంతోనే ట్రంప్ వేటు వేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బ్యూంగ్ బజయ్ పక్ను 2017 అక్టోబర్ నెలలో ట్రంపే నియమించారు. తాజాగా ఆయన ఒత్తిడితోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
‘నా వృత్తిపరమైన జీవితంలో జార్జియా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాను. నాకు సహాయ సహకారాలు అందించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విలువలకే కట్టుబడి పౌరులకు న్యాయాన్ని అందించాను. జార్జియా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు, యూఎస్ సెనేట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ’ అని మాత్రమే బ్యూంగ్ బజయ్ పక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికా మాజీ రక్షణ మంత్రులు ఓ బహిరంగ లేఖను రాశారు. సైన్యం సహాయం తీసుకునైనా అమెరికా అధ్యక్ష ఫలితాలను మార్చేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని ఆ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఆ ఆలోచనను మానుకోవాలని వారు హెచ్చరించారు. అమెరికా రాజ్యాంగ విలువలకు అది విఘాతం కలిగిస్తుందనీ, రాజ్యాంగాన్ని గౌరవించాలని హితవు పలికారు. ఆ లేఖపై సంతకాలు చేసిన వారిలో డెమొక్రటిక్ పార్టీ నేతలతోపాటు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఉండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, International news, Joe Biden, US Elections 2020