అది ఉక్రెయిన్. ఓ మిలిటరీ విమానం గాల్లో దూసుకుపోతోంది. అలా ఎగురుతూ విమానం... ఖార్కివ్ కి దగ్గర్లో... చుగుయివ్ పట్టణంపై ఎగురుతూ... ఒక్కసారిగా దిశ మార్చుకుంది. విమానంలో విమానిక విభాగ విద్యార్థులు ఉన్నారు. విమానం దిశ మార్చుకుందని తెలియగానే వాళ్లంతా కంగారు పడ్డారు. ఏమైంది... ఏమైందని అడుగుతుంటే... అంతలోనే విమానం నేలవైపు వేగంగా దూసుకుపోసాగింది. విద్యార్థుల్లో ఒకటే టెన్షన్. అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. విమానం కిందకు దూసుకుపోతూ... బలంగా ల్యాండ్ అయ్యింది. ఆ కుదుపులకు... ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అణుబాంబు పేలినట్లుగా పెద్ద ఎత్తున మంటలొచ్చాయి. విమానం కాలిబూడిదైంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. విమానంలో మొత్తం 28 ఉంది ఉండగా... వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రివేళ ఈ దుర్ఘటన జరిగింది.
ఉక్రెయిన్ పాలకులు... టీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అందులో AN-26 మిలిటరీ విమానం కాలిబూడిదైనట్లు కనిపిస్తోంది. దీనిపై ఆ దేశ ఎమర్జెన్సీస్ విభాగం స్పందించింది. "ఉక్రెయిన్ మిలిటరీ విమానం... ఏవియేషన్ విద్యార్థులతో వెళ్తున్నది... భూమిపై ల్యాండ్ అవుతూ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు" అని తెలిపింది. ఆన్ బోర్డులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో నలుగురు ఏమయ్యారో తెలియట్లేదు. ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ కి 400 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది.
రిపోర్టులను బట్టీ ఆ విమానంలో మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిసింది. చనిపోయిన విద్యార్థులు... ఆ దేశ రక్షణ శాఖ నిర్వహిస్తున్న ఏవియేషన్ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు. విమానం ఎందుకు కూలిందో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. టెక్నికల్ సమస్యలే కారణం కావచ్చంటున్నారు. బ్లాక్ బాక్స్ లో డేటాను విశ్లేషించాక ఏం జరిగిందో చెబుతామని అధికారులు అంటున్నారు. ఈ కూల్చివేత వెనక... ఎలాంటి కుట్ర కోణం, ఉగ్రవాద కోణం ఉన్నట్లు అనిపించట్లేదని అధికారులు వివరించారు. ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉండే ఆ విద్యార్థులు... ఇంకా కెరీర్ ప్రారంభించకముందే ఇలా ప్రాణాలు కోల్పోవడం విషాదకరమే.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.