Russia-Ukraine War : ఉక్రెయిన్ లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లోని ఐదు నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది రష్యా. కీవ్, పోల్, ఖార్కివ్, సుమీ నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలివెళ్లేందుకు ఈ విరమణ ప్రకటిస్తున్నట్లు రష్యా పేర్కొంది. అయితే మానవ కారిడార్లపై కూడా రష్యా విరుచుకుపడుతోందన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా సుమీ నగరంలో నివాస భవనంపై గత రాత్రి రష్యన్ దళాలు 500 కేజీలున్న భారీ బాంబుతో దాడిచేసిందని... ఈ దాడిలో ఇద్దరు చిన్నారులతో సహా 18 మంది పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అటు చెర్నివిహ్‌లోని ఓ భవనంపై కూడా రష్యా దళాలు ఇదే తరహాలో దాడికి దిగాయి. కానీ అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దీనికి సబంధించిన ఫోటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
ఇక,ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిలో 400 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ప్రకటించారు. 800 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. ఇక 38 మంది చిన్న పిల్లలు మరణించగా, 70 మంది గాయాల పాలయ్యారని ఆయన వివరించారు. అయితే ఇదేమీ కచ్చితమైన లెక్కలు కావని, ఓ అంచనాకు మాత్రమే తాము వచ్చామని ఓ వీడియో సందేశంలో లెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. గణాంకాలను ధృవీకరించడం వెంటనే సాధ్యం కాదని ఆయన తెలిపారు. రష్యా దాడుల్లో 200కు పైగా ఉక్రెయిన్ పాఠశాలలు, 34 హాస్పిటల్స్, 1500 నివాస భవనాలు ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. రష్యా బలగాలు మానవతా కారిడార్లపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు.
ALSO READ Russia Ukraine War: 10 రోజుల్లోనే కిమ్‌ను పక్కకు నెట్టేసిన పుతిన్.. ఆంక్షల్లో ఇప్పుడు రష్యా నం.1
ఇక,ముఖ్యంగా భారతదేశం, చైనా మరియు పర్షియన్ గల్ఫ్ దేశాలకు చెందిన సుమారు 10,000 మంది విదేశీ విద్యార్థులు పోరాటంలో చిక్కుకున్నారని అంచనా వేశారు. బ్రిటిష్ మరియు స్విస్ జర్నలిస్టులపై దాడులు జరిగాయని చెప్పారు. దాదాపు 3 లక్షల మంది పౌరులను రష్యా దళాలు బంధించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు, ఉక్రెయిన్ బలగాలు 11,000 మందికి పైగా రష్యా సైనికులను హతమార్చాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Died, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin, Zelensky