ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో టాప్-3లో ఒకటైన బ్రిటన్ లో మరో ఉగ్రదాడి (Terrorist attack in UK) జరిగింది. ముష్కరుల పరిభాషలో ‘ఒంటరి తోడేలు దాడి’(Lone Wolf attack) గా భావిస్తోన్న ఈ ఘటనలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (MP David Amess)దారుణ దారుణ హత్యకు (UK MP stabbed to death) గురయ్యారు. పట్టపగలు జనం మధ్యలో ఉన్న సమయంలోనే ఎంపీపై భయానక దాడి జరిగింది. తీవ్రమైన కత్తిపోట్లకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎంపీ హత్యను షాకింగ్ ఘటనగా బ్రిటన్ ఎంపీ బోరిస్ జాన్సన్ అభివర్షించారు. ఈ ఘటన బ్రిటన్ సహా యూరప్ దేశాలన్నిటినీ ఉలిక్కిపాటుకు గురిచేశాయి.
బ్రిటన్ లోని ఎసెక్స్ (సౌత్ ఎండ్ వెస్ట్) నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న డేవిడ్ అమీస్ (69) స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం తన సొంత నియోజకవర్గంలోని ఓ చర్చిలో వీకెండ్ సమావేశానికి హాజరయ్యారు. జనంతో మాట్లాడుతోన్న క్రమంలో ఒక్కసారిగా ఓ యువకుడు ఎంపీపై దాడికి తెగబడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు ఎంపీ డేవిడ్ ను పొడిచాడు. అక్కడున్నవాళ్లు తేరుకునేలోపే ఎంపీ పొట్ట చీలిపోయి రక్తం ధారలా కారిపోయింది. షాక్ నుంచి తేరుకున్న ఎంపీ సిబ్బంది దాడి చేసిన యువకుడిని బంధించి, డేవిడ్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూశారు.
ఎంపీ సర్ డేవిడ్ అమీస్ పై దాడిని ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ చర్యగా యూకే పోలీసులు ప్రకటించారు. నిందితుడి వయసు 25 ఏళ్లని, దాడికి పాల్పడిన కారణాలు, అతనికున్న సంబంధాలను ఆరాతీస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, డేవిడ్ ను అనుమానిత ఉగ్రవాది కత్తితో పొడిచి చంపిన ఘటన తర్వాత బ్రిటన్ లోని అందరు ఎంపీలకు భద్రత పెంచారు. ఎంపీ మరణం అత్యంత షాకింగ్ ఘటన అని ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు సైతం కన్జర్వేటివ్ ఎంపీ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కన్జర్వేటివ్ పార్టీలో కీలక నేతగా ఉన్న డేవిడ్ అమీస్ 1983 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అబార్షన్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన జంతుకారుణ్యంపైనా గళమెత్తారు. కాగా, బ్రిటన్ లో ఎంపీలపై జరిగిన దాడుల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన జోకాక్స్ ను దుండగులు కాల్చి చంపారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ కత్తిపోట్లకు గురయ్యారు. ఇప్పుడు కర్జర్వేటివ్ పార్టీ ఎంపీ సర్ డేవిడ్ అమీస్ కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. తుపాకులు, బాంబులతో కాకుండా కత్తితో నేరుగా ఎంపీని హత్య చేసిన ఘటన యూకేలో మొదటిది. దీనిని ఉగ్రవాదంలో మరో మెట్టుగా పోలీసులు భావిస్తున్నారు. టెర్రరిజం విభాగం వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britain, London, Terrorists, United Kingdom