మన ఉద్యోగాలను చైనా దోచేస్తోంది. భారతీయులు లాక్కుంటున్నారు. నేనొస్తే వాళ్లను తరిమేస్తా.. అంటూ ఎన్నికల ప్రచారం చేసి శ్వేతజాతీయుల ఓట్లను గణనీయంగా పొంది అధికారంలోకి వచ్చిన ట్రంప్, తన పదవీకాలం చివర్లో కూడా చైనాను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకున్న ట్రంప్, చైనాను మాత్రం ముప్పతిప్పలు పెట్టారు. ఆ దేశంతో ఆర్థిక యుద్ధాన్నే ప్రకటించారు. కరోనా వైరస్ ను ప్రపంచమంతటా వ్యాప్తి చేసేలా చేసింది చైనాయేనని బహరంగంగా ప్రకటించారు కూడా. మరో రెండ్రోజుల్లో అమెరికా పగ్గాలను వదిలిపెట్టబోతున్న ట్రంప్, తన పరిపాలన చివర్లో కూడా డ్రాగన్ దేశాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆ దేశ టెలికాం దిగ్గజం, హువాయ్ పై ట్రంప్ తన అస్త్రాన్ని విసురుతున్నారు.
చైనాలోని ప్రముఖ హువాయ్ కంపెనీ అమెరికాలోని టెలికాం కంపెనీలకు ఎలక్ట్రానిక్ విడి భాగాలను సరఫరా చేస్తుంటుంది. అమెరికా వ్యాప్తంగా ఈ కంపెనీకి పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని ఒక్క అగ్రరాజ్యంలోనే ఈ కంపెనీ చేస్తోంది. తాజాగా ట్రంప్ ఈ కంపెనీపై కన్నేశారు. ఈ కంపెనీ అమెరికాకు చేసే ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచనను ట్రంప్ సర్కారు చేస్తోంది. ఇదే జరిగితే అమెరికా కంపెనీలు మరో విడి భాగాలను సరఫరా చేసే కంపెనీని చూసుకోక తప్పదు. ఫలితంగా హువాయ్ కంపెనీకి 120 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది.
దీంతోపాటు పలు అమెరికా కంపెనీలతో హువాయ్ కంపెనీ ఒప్పందాలను చేసుకునే ప్రక్రియను జరుపుతోంది. ట్రంప్ కనుక హువాయ్ కంపెనీపై నిషేధాన్ని విధిస్తే ఆ ఒప్పందాలు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. వీటి విలువ ఏకంగా 280 బిలియన్ డాలర్లని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా చైనాను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసినట్టవుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మరో రెండ్రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వైట్ హౌస్ నుంచి ట్రంప్ వెళ్లిపోనున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ట్రంప్ హాజరుకావడం లేదు. ఆయన తరపున ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరవుతారు.
Published by:Hasaan Kandula
First published:January 18, 2021, 14:24 IST