Travel Restrictions: భారత విద్యార్థులపై ఆంక్షలు సడలిస్తున్న ప్రపంచ దేశాలు.. రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర మంత్రి

భారత విద్యార్థులపై ఆంక్షలు సడలిస్తున్న ప్రపంచ దేశాలు

అమెరికా, కెనడా, యూకే, జర్మనీతో పాటు పలు దేశాలు భారత విద్యార్థులపై ఆంక్షలు సడలించాయి. మరిన్ని దేశాలు ఇదే దారిలో నడుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది.

  • Share this:
భారత్‌లో కరోనా రెండో వేవ్ ప్రారంభం కాగానే చాలా దేశాలు మన దేశానికి ట్రావెల్ బ్యాన్ ప్రకటించాయి. భారత్ నుంచి ప్రయాణాలను వివిధ దేశాలు నిషేధించాయి. దీంతో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం సెకెండ్ వేవ్ దాదాపుగా తగ్గిపోయింది. దీంతోపాటు యూనివర్సిటీల్లో కొత్త సెమిస్టర్లు ప్రారంభమయ్యే సమయం ప్రారంభమైంది. దీంతో భారత విద్యార్థులపై ఇతర దేశాలు విధించిన ట్రావెల్ నిబంధనలను తొలగించే ప్రయత్నాలు చేస్తోంది విదేశాంగ శాఖ. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన కూడా చేసింది.

అమెరికా, కెనడా, యూకే, జర్మనీతో పాటు పలు దేశాలు భారత విద్యార్థులపై ఆంక్షలు సడలించాయి. మరిన్ని దేశాలు ఇదే దారిలో నడుస్తాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ట్రావెల్ ఆంక్షలను ఎత్తివేయడానికి వివిధ దేశాలతో మాట్లాడుతోందన్నారు. భారతీయ విద్యార్థులు ఎన్ రోల్ చేసుకున్న విదేశీ విద్యాసంస్థలతో కూడా మాట్లాడుతున్నామని ప్రకటించారు. "విదేశాంగ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్) వివిధ దేశాలతో మాట్లాడుతోంది. ఆయా దేశాలు ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేసేలా నిబంధనలు సులభతరం చేసేలా మేం ప్రయత్నిస్తున్నాం. భారత విద్యార్థులు ఆయా దేశాలకు ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం" అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.

అమెరికా, కెనడా, యూకే, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే నిబంధనలు తొలగించగా.. తాజాగా ఐర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్జెంబర్గ్, జార్జియా వంటి దేశాలు కూడా కరోనా పరిస్థితులు మెరుగు పడడంతో భారతీయ విద్యార్థులను అనుమతిస్తున్నాయి. ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం విదేశాల్లో ఉన్న భారతీయులను ముఖ్యంగా భారతీయ విద్యార్థులను కాపాడడమే అని మురళీధరన్ వెల్లడించారు.

కరోనా ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ ప్రభుత్వం కరోనాతో పోరాడడంతో పాటు దాని ప్రభావం తగ్గించే దిశగా పోరాడుతున్నామని వివరించారు. ఈ కరోనా పరిస్థితుల్లో భారత్ అంతర్జాతీయ సమాజం సహకారంతో కరోనా పై పోరాడుతోంది. కరోనా వైరస్ లో మ్యూటేషన్స్ రావడంతో ఒకటి కంటే ఎక్కువ వేవ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా భారత ప్రభుత్వం, ప్రజలు దాన్ని ఎదిరించేందుకు పోరాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
Published by:John Naveen Kora
First published: