TOWN IN UK WENT INTO LOCKDOWN AFTER A SQUIRREL ATTACKS MANY PEOPLE LATER OFFICIALS KILLED IT BY GIVING INJECTION SK
Psycho Squirrel: సైకో ఉడత వల్ల అక్కడ లాక్డౌన్.. దాని టార్చర్ భరించలేక మరణశిక్ష వేశారు..
ప్రతీకాత్మక చిత్రం
Psycho Squirrel: బక్లే పట్టణంలో 16వేల జనాభా ఉంటుంది. అక్కడ క్రిస్మస్ సమయంలో దీని గురించే చర్చ. అప్పటికే అది 18 మందిపై దాడి చేసింది. చాలా మంది ఆ ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెటట్టారు.
ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇప్పటికే యూరప్, అమెరికా దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు చాలా దేశాలు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ నుంచి బయటపడాలంటే ప్రజలంతా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూకేలోని వేల్స్కు చెందిన ఓ పట్టణంలో కూడా లాక్డౌన్ విధించారు. ఫ్లింట్షైర్లోని బక్లే పట్టణంలో ప్రజలే స్వచ్ఛందంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయారు. ఐతే దీనికి కరోనా కారణం కాదు. ఓ ఉడత. అవును మీరు చదివింది నిజమే. ఉడత వల్ల ఆ పట్టణ ప్రజలు నరకం చూశారు. దానిని టార్చర్ భరించలేక ఇళ్ల నుంచి బయటకు రాలేదు. అలా ఎవరికి వారే లాక్డౌన్ పాటించారు.
బక్లే పట్టణానికి చెందిన కొరిన్ రెనాల్డ్స్ అనే మహిళ పక్షుల ప్రేమికురాలు. ఆమె ఇంట్లో ఎన్నో పక్షులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమె వద్దకు ఓ ఉడత వచ్చింది. అది ఆమెకు ఎంతగానో నచ్చడంతో పక్షులతో పాటు ఉడుతను కూడా బాగా చూసుకునేది. అది రోజూ కొరిన్ వద్దు వచ్చి ఆహారం తీసుకునేది. ఐతే క్రిస్మస్కు కొన్ని రోజులు ముందు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఉడత సాధు జంతువు. కానీ ఉన్నట్లుండి అది సైకోలా మారింది. తనకు ఆహారం పెట్టే.. కొరిన్పైనే దాడి చేసింది. ఆమె చేతిని కొరికి పారిపోయింది. అదేంటి..దానిని అంత మంచిగా చూసుకుంటే..ఇలా చేసిందేంటని ఆశ్చర్యపోయింది. ఐతే ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా కొరిన్కు సంచలన విషయాలు తెలిశాయి. ఆ ఉడత గురించి ఎంతో మంది ఫేస్బుక్లో పోస్ట్లు పెట్టారు. అది సైకో అని.. తమను గాయపరిచిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ ఉడతకు దూరంగా ఉండాలని కామెంట్స్ పెట్టారు.
బక్లే పట్టణంలో 16వేల జనాభా ఉంటుంది. అక్కడ క్రిస్మస్ సమయంలో దీని గురించే చర్చ. అప్పటికే అది 18 మందిపై దాడి చేసింది. చాలా మంది ఆ ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెటట్టారు. ఈ నేపథ్యంలో.. ఉడత టార్చర్ ఎక్కువయిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని.. పట్టణ వాసులు ఆందోళన చెందారు. అంతేకాదు ఆ ఉడతకు గ్లెమిన్స్ మూవీలోని విలన్ పేరు పెట్టారు. స్క్రైప్గా నామకరణం చేశారు. ఈ ఉడత నుంచి ఎలాగైనా పట్టణ ప్రజలను కాపాడాలని భావించిన కొరిన్ రెనాల్డ్స్.. ఉడతకు రోజూ ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టింది. అనుకోకుండా అది వచ్చి అందులో ఇరుక్కుపోయింది. దానిని బంధించి ది రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ సంస్థకు అప్పగించింది. దానిని మొదట దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలని అనుకున్నారు. కానీ స్థానిక చట్టం అందుకు అంగీకరించదు. చంపడం తప్ప మరో మార్గం లేదని అధికారులు నిర్ణయించారు.
చివరకు ఓ పశు వైద్యుడు.. ఆ ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించాడు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. ఐతే ఉడత మరణించడంతో కొరిన్ ఎంతో బాధిపడింది. ఎందుకంటే ఆమె జంతు, పక్షి ప్రేమికురాలు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆమే.. ఉడతను పట్టించింది. ఒక విధంగా దాని మరణానికి తానే కారణమని కొరిన్ ఎంతో బాధపడింది. కానీ బక్లే పట్టణ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకున్నారు. సైకో ఉడత పీడ విరగడయిందని ఎంతో సంతోషించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.