ఇండోనేసియా సునామీ: జైళ్లు ధ్వంసం..1200 మంది ఖైదీలు పరారీ

తప్పించుకున్న ఖైదీల్లో ఎక్కువ మంది అవినీతి, డ్రగ్స్ కేసులో శిక్షపడ్డ వారే ఉన్నారు. ఉగ్ర సంబంధ నేరాలకు పడ్డ ఐదుగురు ఖైదీలు సైతం తప్పించుకున్న వారిలో ఉన్నారు.

news18-telugu
Updated: October 1, 2018, 4:23 PM IST
ఇండోనేసియా సునామీ: జైళ్లు ధ్వంసం..1200 మంది ఖైదీలు పరారీ
పాలూ నగరంలో సునామీ బీభత్సం
  • Share this:
భారీ భూకంపం, సునామీ ధాటికి ఇండోనేసియాలోని సులవెసి ద్వీపం అల్లకల్లోలమైంది. ప్రకృతి విలయానికి 800 మందికి పైగా చనిపోయారు. సునామీ బీభత్సానికి ద్వీపంలోని మూడు జైళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే అదునుగా భారీ మొత్తంలో ఖైదీలు పారిపోయారు. సుమారు 1200 మంది జైళ్ల నుంచి తప్పించుకున్నారని ఆ దేశ న్యాయశాఖా మంత్రి పుగు ఉటామి మీడియాకు తెలిపారు. ప్రాణ భయంతో కొందరు, కుటుంబ సభ్యుల క్షేమంపై ఆందోళనతో మరికొందరు ఖైదీలు పారిపోయారని వెల్లడించారు.

సునామీ విధ్వంసానికి పాలూ నగరంలో ఉన్న రెండు జైళ్లు ధ్వంసమయ్యాయి. జైలు గోడలు కూలిపోవడంతో భారీగా నీరు వచ్చి చేరింది.దాంతో ప్రాణ భయంతో ఖైదీలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. మరికొందరు జైలు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి తప్పించుకున్నారు. ఆ సమయంలో సునామీని జీవన్మరణ సమస్య భావించి ఉంటారని..అందుకే పారిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. పాలు నగరంలోని రెండు జైళ్లలో ప్రస్తుతం వంద మంది ఖైదీల మాత్రమే ఉన్నారని వెల్లడించారు.

సునామీ రావడంతో డోంగ్‌గలా జైల్లో ఉన్న ఖైదీలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. తమ వారిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేయడంతో అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలోనే జైలుకు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో .. అందులో ఉన్న 343 మంది ఖైదీలు తప్పించుకున్నారు.


ఇక సునామీ విలయానికి పాలూ నగరం తుడిచిపెట్టుకుపోయింది. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన ఎంతో మంది పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీధులన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. స్థానికులు ఆహారం, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తప్పించుకున్న ఖైదీల్లో ఎక్కువ మంది అవినీతి, డ్రగ్స్ కేసులో శిక్షపడ్డ వారే ఉన్నారు. ఉగ్ర సంబంధ నేరాలకు పడ్డ ఐదుగురు ఖైదీలు సైతం తప్పించుకున్న వారిలో ఉన్నారు. వారి కోసం పాలూ పోలీసులు గాలిస్తున్నారు.

Published by: Shiva Kumar Addula
First published: October 1, 2018, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading