దక్షిణాఫ్రికా (South Africa)లో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron variant).. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ (Britain) చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్ (Israel)లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ (vaccine) తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) నఫ్తాలీ బెన్నెట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇజ్రాయెల్ పర్యాటక శాఖ (Israel tourism ministry) మాత్రం అస్సలు తగ్గేదేలే అంటోంది.. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ కార్యక్రమం నిర్వహిస్తామంటోంది. ఇంతకీ ఏంటా కార్యక్రమం.. ఎందుకు అంత స్పెషల్ ఒకసారి చూద్దాం..
అందాల పోటీలు నిర్వహిస్తాం..
ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఓమిక్రాన్’ కారణంగా తమ దేశంలో ఆంక్షలు విధించినప్పటీకి ‘మిస్ యూనివర్స్-2021’ పోటీలు (Miss Universe 2021 ) జరిపి తీరుతామని ఇజ్రాయెల్ పర్యాటక శాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న ఐలాట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి యోయెల్ రజ్వోజోవ్ (Yoel Rajvozhov) ఆదివారం వెల్లడించారు. ఈ అందాల పోటీలో పాల్గొనే అందరికీ ప్రతి 48 గంటలకు పీసీఆర్ కరోనా (PCR Corona) నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే వైరస్‌కు సంబంధించి ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. దాదాపుగా 174 దేశాల్లో ఈ అంతర్జాతీయ కార్యక్రమం (Miss Universe 2021) ప్రసారం (telecast) అవుతుందని, అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేమని ఆయన పేర్కొన్నారు.
ఓ మహిళా టూరిస్ట్‌కు ఓమిక్రాన్ వైరస్..
కాగా మలావి నుంచి వచ్చిన ఓ మహిళా టూరిస్ట్‌కు ఓమిక్రాన్ వైరస్ (Omicron virus) సోకిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో శనివారం నుంచే విదేశీయులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. అర్ధరాత్రి మంత్రవర్గ సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇజ్రాయెల్ దేశంలో ఆదివారం నుంచి మొత్తం 14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్- ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్ దేశస్తులు కూడా క్వారంటైన్‌లో ఉండాలని, ఇంతకుముందు మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరవాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.