శ్రీలంక ఆర్థిక సంక్షోభం (Srilanka Crisis) లో చిక్కుకొని విలవిల్లాడిపోతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే.. ఏం చేయాలో అర్థంకాక పాలకులు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ సాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. తమను ఆదుకునేందుకు ముందుకు రావాలని పెద్ద దేశాలను కోరుతోంది. ఐతే ఇప్పటి వరకు భారత్ తప్ప ఎవరూ తమకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. భారత్ లాగే మిగతా దేశాలు కూడా సాయం చేయాలని కోరుతోంది.
మాకు ఇంధన సాయం చేయాల్సిందిగా పలు దేశాలకు విజ్ఞప్తి చేశాం. ఏ దేశం సాయం చేసేందుకు ముందుకొచ్చినా.. మేం అభినందిస్తాం. ఇప్పటికైతే భారత్ మాత్రమే మాకు క్రెడిట్ లైన్ కింద సాయం చేసింది. రష్యాతో కూడా మాట్లాడుతున్నాం. రష్యాలో ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. మాకు ఏం కావాలో వారికి వివరించాం. రష్యా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అని శ్రీలంక విద్యుత్, ఇంధనశాఖ మంత్రి కాంచన విజెశేఖర (Kanchana Wijesekera)పేర్కొన్నారు.
శ్రీలంక సంక్షోభంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని పార్లమెంటు స్పీకర్ మహింద యప అబెవర్దన అధికారికంగా ప్రకటించారు. జూలై 14 నుంచే వర్తించేటట్టుగా రాజపక్స రాజీనామా చేశారని పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే ప్రక్రియ ముగిసేవరకూ ప్రధాని రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. అనంతరం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
మరోవైపు ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa)కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిశాయి. వారం క్రితం దేశ ప్రజల నుంచి తప్పించుకునేందుకు ఆయన అధ్యక్ష భవనాన్ని విడిచివెళ్లారు. యుద్ధనౌకలో దేశం నుంచి పారిపోయారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక యుద్ధ విమానంలో మాల్దీవులు రాజధాని మాలెకు వెళ్లారు. ఆ మరుసటి రోజు సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్‌కు చేరుకున్నారు. గొటబాయ వెంటే ఆయన భార్య, ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు. ఐతే గొటబాయ ముందుగా ఇండియాకు రావాలని అనుకున్నారట. కానీ భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని తెలిసింది. లంక ప్రజలకు వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసిందంట. ఈ క్రమంలోనే గొటబాయ సింగపూర్‌కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు.
Modi పట్టుకు దిగొచ్చిన Biden -భారత్‌పై CAATSA ఎత్తేసిన అమెరికా -రష్యా ఎస్-400 రయ్ రయ్
శ్రీలంకలో మరో వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. అధ్యక్ష పదవికి జూలై 19న నామినేషన్లను స్వీకరిస్తారు. 20న పార్లమెంట్ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 225 మంది సభ్యులు రహస్య ఓటింగ్‌లో పాల్గొని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరి కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలవబోతున్నారు? కనీసం ఆయనైనా శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారా? అని లంక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, International news, Sri Lanka, Srilanka