THE HUGE INCREASE IN OMICRON CASES IN THE UK AND MANY COUNTRIES AROUND THE WORLD TOWARDS LOCKDOWN PRV
Omicron : యూకేలో విజృంభిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాల్లో ఆంక్షలు షురూ... లాక్‌డౌన్ దిశగా పలు దేశాలు..
ప్రతీకాత్మక చిత్రం
యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రపంచంలోని ఆయా దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూయార్క్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్ల కంటే సెకండ్ వేవ్‌లో భారత్‌లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron) వైరస్‌పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను 89 దేశాల్లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. దీని వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1.5–3 రోజుల్లోనే ఇది రెట్టింపవుతోందని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా శుక్రవారం ఒమిక్రాన్‌పై సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సమూహ వ్యాప్తి జరుగుతున్న చోట డెల్టాను ఈ వేరియంట్ మించిపోగలదని తెలిపింది. మరోవైపు యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రపంచంలోని ఆయా దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూయార్క్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
ఫ్రాన్స్ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ‘జనవరి ఆరంభానికల్లా ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్‌గా అవతరించే అవకాశాలున్నాయి. ఐదోవేవ్ వచ్చేసింది, పూర్తిస్థాయిలో విరుచుపడుతోంది’ అని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్తక్స్ ప్రకటించారు. క్రిస్మస్‌కు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దని, వేడుకల్లో పాల్గొనే కుటుంబసభ్యుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరారు.
వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం (సేజ్) ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్‌డౌన్ సిఫారసు కూడా ఉంది.
లండన్‌లో శుక్రవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నగర మేయర్ సాదిక్ ఖాన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా... మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్‌లలో ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుత్రుల్లో అందేస్థాయి సేవలు అందకపోవచ్చనే సంకేతాలను మేయర్ ఇచ్చారు. ఇక భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.