కారులో దూరిన ఎలుగుబంటి... ఏం చేసిందంటే...

రోడ్డు పక్కన కార్లు పార్క్ చేస్తున్నారా... ఇప్పుడే వచ్చేస్తాం కదా అని డోర్లు లాక్ చెయ్యకుండా వెళ్తున్నారా... అయితే జాగ్రత్త ఈ హెచ్చరిక మీ కోసమే అంటున్నారు అక్కడి పోలీసులు. ఎందుకో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 9:21 AM IST
కారులో దూరిన ఎలుగుబంటి... ఏం చేసిందంటే...
నాశనమైన కారు (Image : FB - Snowmass Village Police Department)
  • Share this:
అమెరికా... కొలరాడోలో... ఓ జంట... తమ కారును రోడ్డు పక్కన పార్క్ చేసింది. దురదృష్టం కొద్దీ... దాని డోర్ లాక్ చెయ్యడం మర్చిపోయింది. అక్కడికి దగ్గర్లోనే ఏదో పని ఉండటంతో... ఆ జంట నడుస్తూ... అలా వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి... పక్కనున్న చిట్టడవి లోంచీ ఓ ఎలుగుబంటి అటుగా వచ్చింది. కారును చూడగానే... అందులో ఏవైనా తినే పదార్థాలు ఉంటాయనుకొని దగ్గరకు వెళ్లింది. డోర్ కొద్దిగా ఓపెన్ అయినట్లు ఉండటంతో... అది పూర్తిగా తెరచి చూసింది. కారులో ఎవరూ లేకపోవడంతో లోపలికి వెళ్లిపోయింది. అదే సమయంలో జోరు గాలి రావడంతో... కారు డోరు ఒక్కసారిగా పడి... ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. అంతే... ఎలుగుబంటికి తనను బంధించేందుకే ఇదంతా చేశారనీ, ఇక తన పని అయిపోయినట్లేనని తెగ భయపడిపోయింది. పారిపోయేందుకు అన్ని వైపుల నుంచీ ప్రయత్నించి... చివరకు ఏం చెయ్యలేక దిగాలుగా ఉండిపోయింది.

నాశనమైన కారు (Image : FB - Snowmass Village Police Department)


కాసేపటికి ఎలుగుబంటికి కోపం వచ్చింది. అంతే... కారు మొత్తం సర్వనాశనం చెయ్యాలని డిసైడైంది. లోపల సీట్లు, ఇంటీరియర్ మొత్తం పీకి పందిరేసింది. లోపలి పనిముట్లు, స్టీరింగ్, గేర్ రాడ్డు ఇలా దేన్నీ వదలకుండా అన్నీ ఊపి, లాగి, నానా చిందరవందర చేసేసింది. అది ఎంత మొండిదంటే... చివరకు... కారు అద్దాలు పగలగొట్టి... దర్జాగా అక్కడి నుంచీ పారిపోయింది.

నాశనమైన కారు (Image : FB - Snowmass Village Police Department)
ఎలుగు బంటి వెళ్లిపోయిన... కాసేపటికి వెనక్కి వచ్చిన ఆ జంట... ఆ కారును చూసి... అది తమది కాదేమో అనుకున్నారు. తీరా నంబర్ చూశాక... తమదే అని అర్థమైంది. లోపల ఇంటీరియర్ చూసి తెల్లమొహం వేశారు. దొంగల పని అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బట్... పోలీసుల దర్యాప్తులో అది ఎలుగుబంటి పని అర్థమైంది. ఇదే విషయాన్ని ప్రజలతో పంచుకుంటూ... స్నోమాస్ విలేజ్ పోలీసులు... ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ పెట్టారు. ఇలా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకు కూడా రాదని చెబుతున్నారు.


రోడ్డు పక్కన కార్లు పార్క్ చేస్తున్నారా... ఇప్పుడే వచ్చేస్తాం కదా అని డోర్లు లాక్ చెయ్యకుండా వెళ్తున్నారా... అయితే జాగ్రత్త ఇలా జరిగే ప్రమాదం ఉంది అంటున్నారు అక్కడి పోలీసులు.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు