ఈస్టర్ డే రోజు శ్రీలంక పేలుళ్లతో ఉలిక్కిపడింది. పదేళ్ల క్రితం LTTE కనుమరుగవడంతో అంతర్యుద్దం ముగిసి ప్రశాంతతను సంతరించుకున్న లంకలో తాజా పేలుళ్లు భయోత్పాతాన్ని సృష్టించాయి. లంక రాజధాని కొలంబోలో వరుసగా 8 చోట్ల బాంబులు పేలడంతో 290 మంది మృతి చెందారు. వీరిలో 35మంది విదేశీయులు ఉన్నారు. అయితే లంక లాంటి చిన్న దేశాన్ని ఈ స్థాయిలో భయాందోళనకు గురిచేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు చేసిన దాడా? లేక మళ్లీ అంతర్యుద్దానికి సంకేతంగా జరిగిన దాడా? అన్నది తేలాల్సి ఉంది. లంకలో పేలుళ్ల నేపథ్యంలో 'న్యూస్18' అక్కడి క్షేత్రస్థాయిని పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించింది. ఆ వివరాలు మీకోసం..
తన భార్య దిలీపా పుట్టినరోజును ఈరోజు సాయంత్రం కొలంబోలోని ఓ హోటల్లో సెలబ్రేట్ చేయాలని శ్రీలంక సివిల్ ఏవియేషన్ వైస్ ఛైర్మన్ శశి దనతుంగే భావించాడు. ట్రాన్స్‌పోర్ట్&సివిల్ ఏవియేషన్ మంత్రి, ఒకప్పటి లంక క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ, ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలా ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే రణతుంగకు ఓ కబురు అందింది. కొలంబోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్ద పేలుళ్లు జరిగాయన్న సమాచారం వచ్చింది. కొలంబోతో పాటు నెగొంబో, బత్తికలోవా నగరాల్లోనూ పేలుళ్లు జరిగాయన్న సమాచారం తెలిసింది. పేలుళ్ల గురించి తెలిసి శశి దనతుంగే షాక్ తిన్నాడు.
శశి దనతుంగే ఇంటికి కొన్ని కి.మీ దూరంలో, వెంకటేశ్ రావు అనే ఓ భారతీయుడు నివసిస్తున్నాడు. పేలుళ్ల గురించి తెలియడానికి ముందు.. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిద్దమవుతున్నారు. కొన్నేళ్ల క్రితమే ఆయన ముంబై నుంచి లంకకు వచ్చి స్థిరపడ్డారు. జీవితం ప్రశాంతంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో తాజా పేలుళ్లు ఆయన్ను కలవరపెడుతున్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని ఇప్పుడాయన భావిస్తున్నారు.
పేలుళ్లపై శ్రీలంక ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన రోషన్ మహనామా స్పందించారు. పేలుళ్లు జరిగిన సిన్నమాన్ హోటల్ ప్రాంతంలోనే ఆయన నివాసం ఉంది. వరుస పేలుళ్ల గురించి తెలిసి షాక్‌కి గురైనట్టు న్యూస్18తో తెలిపారు. పదేళ్లుగా లంకలో ప్రశాంతంగా ఉన్నామని.. తాజా పేలుళ్లతో పరిస్థితులు మళ్లీ ఎక్కడికి దారితీస్తాయోనన్న భయం నెలకొందని అన్నారు.
వికాసన్ అనే శ్రీలంకన్.. ఆదివారం కావడంతో ఈరోజు కాస్త ఆలస్యంగా నిద్ర లేచాడు. ఈస్టర్ సండే అయినా.. ఎక్కడా ఆ హడావుడి లేదేంటా అనుకున్నాడు. పేలుళ్ల గురించి తెలియగానే షాక్ తిన్నాడు. కొద్దిసేపు వరకు పేలుళ్ల గురించి అసలు తాను నమ్మలేదని చెప్పారు. అది నిజమని తెలిశాక నిర్ఘాంతయపోయినట్టు వెల్లడించాడు. ఉగ్రవాదం అనేది మా ఊహల్లో కూడా లేని విషయం అని.. అందుకే ఇలాంటి ఘటన జరుగుతుందని ఏనాడు ఊహించలేదని అన్నాడు. అందమైన తమ దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతోందని.. ఇలాంటి ఘటనలకు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
పదేళ్ల క్రితం 2009లో లంకలో LTTE అంతర్యుద్దం ముగిసిన నాటి నుంచి దేశం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి తరుణంలో లంక వ్యాప్తంగా ఇన్ని పేలుళ్లు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. తాజా పేలుళ్లలో దాదాపు 185మంది మృతి చెందగా.. 500 మంది వరకు గాయపడ్డారు.
వికాసన్ లాగే దాదాపుగా అందరు శ్రీలంకన్లు ఇదే చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్నామన్న 2.2కోట్ల శ్రీలంకన్ల నమ్మకాన్ని నేటి పేలుళ్లు తుడిచిపెట్టేశాయి. LTTE అంతమయ్యాక దేశంలో ఇక ఉగ్రవాదానికి తావు లేదు అని అందరికీ ఓ నమ్మకం ఏర్పడినవేళ.. మళ్లీ పేలుళ్లు జరగడం వారిలో భయాందోళనను నింపింది. తాజా పేలుళ్లకు ఇప్పటివరకైతే ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. మృతుల కుటుంబాల గురించి పట్టించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న తొలి కర్తవ్యం అని శ్రీలంక మంత్రి ఒకరు తెలిపారు. పేలుళ్లపై ఊహాగానాల కంటే.. విచారణలో అసలు నిజాలు బయటపడేదాకా వేచి చూస్తామని అన్నారు. త్వరలోనే ఉగ్రవాదులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.