Terror Attack: ఉగ్రవాదుల కాల్పుల్లో 100మందికి పైగా మృతి.. పశ్చిమాఫ్రికాలో నరమేధం

ప్రతీకాత్మక చిత్రం

బుర్కినా ఫాసోలోని సాహెల్ ప్రాంతంలో దాదాపు 5వేల ఫ్రెంచ్ దళాలు ఉన్నప్పటికీ అక్కడ ఉగ్రదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఒకే వారంలో 50 మంది మరణించారు.

  • Share this:
    పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో నెత్తుటేరులు పారాయి. ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. యాఘా ప్రావిన్స్‌లోని సోల్హాన్ గ్రామంలోకి చొరబడి కాల్పులతో విరుచుకుపడ్డారు. దొరికిన దొరికినట్లుగా కాల్చి చంపారు. ఉగ్రవాదుల దాడిలో కనీసం 100 మంది చనిపోయారని బుర్కినా ఫాసో ప్రభుత్వం తెలిపింది. నైగర్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో స్థానిక మార్కెట్‌తో పాటు పలు భవనాలను నిప్పుపెట్టారని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఉస్సేనీ తంబోరా పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఆ దేశ అధ్యక్షుడు రోక్ మార్క్ క్రిస్టియన్ కబోర్ తీవ్రంగా ఖండించారు. ఇది అనాగరిక చర్య అని.. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

    గత ఐదేళ్లుగా బుర్కినా ఫాసోలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోయాయి. చాలా చోట్ల విధ్వంసం సృష్టిస్తున్నారు. గత కొన్నేళ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. బుర్కినా ఫాసోలో ఉగ్రవాద నిర్మూలనకు ఫ్రాన్స్ నేతృత్వంలోని కౌంటర్ టెర్రరిజం కోయలిషన్ అక్కడ పనిచేస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి వారిని ఏరివేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉనికి చాటుకోవడం కోసం అల్ ఖైదా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.

    బుర్కినా ఫాసోలోని సాహెల్ ప్రాంతంలో దాదాపు 5వేల ఫ్రెంచ్ దళాలు ఉన్నప్పటికీ అక్కడ ఉగ్రదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఒకే వారంలో 50 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు స్పానిష్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనలను మరవక ముందే.. ఇప్పుడు మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఒకే గ్రామంలో 100 మందికి పైగా ఊచకోత కోశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది భయంతో తాము నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోయారు. లక్షలాది ప్రజలు ప్రాణాలరచేత పట్టుకొని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: