ఆఫ్ఘానిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై తాజాగా ప్రకటన చేశారు. ఆఫ్గానిస్తాన్‌లో(Afghanisthan) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు. ముల్లా మహమ్మద్ హసన్(Mullah Mohammad Hassan) ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నట్టు తెలిపారు. ఆఫ్ఘానిస్తాన్ ఉప ప్రధానులుగా.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్(Abdul Ghani Baradar), కీలక నేత అబ్దుల్ సలాం హనాఫీని(Abdul Salam Hanafi) నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తాలిబన్లు వివరాలు వెల్లడించారు.‘మా దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు’అని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
అంతేకాకుండా మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అమెరికా, దాని మిత్ర దేశాల వారిపై పోరాటం చేసిన నాయకులకు పెద్ద పీట వేశారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తనయుడు ముల్లా యాకుబ్‌ను రక్షణ మంత్రిగా, హక్కానీ మిలిటెంట్ గ్రూప్‌కు( Haqqani militant group) చెందిన సిరాజుద్దీన్ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారు. సిరాజుద్దీన్ ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. అతనిపై 5 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. విదేశాంగ మంత్రిగా అమీర్ ఖాన్ ముత్తాకీని నియమించారు.అయితే తాలిబన్లు ప్రభుత్వంలో అంత ఊహించినట్టుగానే.. మహిళలకు మాత్రం చోటు కల్పించలేదు.
ఇక, అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన తర్వాత.. తాలిబన్లు చాలా వేగంగా పావులు కదిపారు. ఆఫ్ఘాన్‌లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ వేగంగా ముందుకు కదిలారు. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తమ చేతుల్లోకి తీసుకన్న సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు 30వ తేదీన అమెరికాల పూర్తిగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి. అయితే ఆఫ్ఘానిస్తాన్‌లో వారం క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తాలిబన్లు.. అక్కడ ముల్ల మహమ్మద్ హసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Taliban