Home /News /international /

SWITZERLAND NARROWLY VOTES TO BAN BURQA FACE COVERING IN PUBLIC BA GH

Burqa ban: ఆ దేశంలో బురఖాలపై నిషేధం.. సమర్థిస్తున్న దేశ ప్రజలు

ప్రతీకాత్మక చిత్రం (Image; Reuters)

ప్రతీకాత్మక చిత్రం (Image; Reuters)

యూరోపియన్ దేశాల్లో ముస్లిం సంప్రదాయాలపై ఒకరకమైన ఫోబియా నెలకొంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో బురఖాలు, నిఖాబ్‌లపై ఆంక్షలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, నిఖాబ్‌లను ఫ్రాన్స్ 2011లోనే నిషేధించింది.

ఇంకా చదవండి ...
ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై చాలా పాశ్చాత్య దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని యూరోపియన్ దేశాల్లో ముస్లింల డ్రెస్‌ కోడ్‌పై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా స్విట్జర్లాండ్‌లోనూ నిఖాబ్, బురఖాలపై నిషేధం విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశంలో ముఖాన్ని పూర్తిగా కప్పిఉంచే ఫేస్ కవరింగ్స్‌పై నిషేధం విధించాలనే అంశంపై ఆదివారం రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) జరిగింది. ఈ వివాదాస్పద ప్రతిపాదనకు 51.21 శాతం మంది మద్దతు పలకడం విశేషం. ఇప్పటి నుంచి ఆ దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో నిఖాబ్, బురఖా, ఇతర ఫేస్ కవరింగ్స్‌పై నిషేధం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది.

స్విట్జర్లాండ్‌లోని వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా రవాణా, రెస్టారెంట్లు, దుకాణాలు... అన్ని ప్రాంతాల్లోనూ వీటిపై నిషేధం ఉంటుంది. మందిరాలు, ప్రార్థనా స్థలాల్లో మాత్రం ఈ నియమం వర్తించదు. ఆరోగ్యం, భద్రత పరమైన కారణాలకు ఫేస్ కవరింగ్స్‌ను వాడవచ్చు. కార్నివాల్స్, ఇతర మతపరమైన సమ్మేళనాల్లో ఈ నియమానికి మినహాయింపులు ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ ప్రతిపాదనలు చట్టరూపం దాల్చనున్నాయి.

అతివాద పార్టీల ప్రతిపాదన
స్విట్జర్లాండ్‌లోని స్విస్ పీపుల్స్ పార్టీ, ఇతర రైట్ వింగ్ సంస్థలు.. బురఖాలు, నిఖాబ్‌లు, ఇతర ఫేస్ కవరింగ్స్‌పై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలో ఇస్లాం సంప్రదాయాలను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పి ఉంచి ఆందోళనలు చేస్తున్న వారిని గుర్తించాలనే ఉద్దేశంతోనే ఫేస్‌ కవరింగ్స్‌పై నిషేధం విధించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. కానీ ఆ దేశ మీడియా మాత్రం ఈ ప్రతిపాదనను బురఖాలపై నిషేధమనే నినాదంగా మార్చింది. దీంతో దేశంలోని మత సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు దీన్ని వ్యతిరేకించాయి. స్విస్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియన్స్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించింది. మతపరమైన స్వేచ్ఛలో డ్రెస్‌ కోడ్‌ ఒక భాగంగా ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది.

వ్యతిరేకించిన ప్రభుత్వం
రెఫరండంలో ఫేస్ కవరింగ్స్‌ను నిషేధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని స్విస్ ప్రభుత్వమైన ఫెడరల్ కౌన్సిల్, స్విస్ పార్లమెంటు ప్రజలకు పిలుపునిచ్చాయి. నిషేధం కాకుండా మరో అంశాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం భద్రతాపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు లేదా ఇతర అధికారులు అడిగినప్పుడు ఫేస్ కవరింగ్స్ తీసివేయాల్సి ఉంటుంది. కానీ స్వల్ప ఆధిక్యంతో నిషేధానికే ప్రజలు మొగ్గుచూపడం విశేషం.

హక్కుల సంఘాల ఆందోళన
అనేక సంవత్సరాల వాదోపవాదాలు, చర్చల తరువాత స్విస్ ప్రభుత్వం ఈ అంశంపై ఆదివారం రెఫరండం నిర్వహించింది. ఆ దేశంలోని రెండు రాష్ట్రాలు గతంలోనే ఫుల్ ఫేస్ కవరింగ్స్‌పై నిషేధం విధించాయి. అయితే ఇలాంటి చర్యలు ముస్లిం వ్యతిరేక భావనను ప్రోత్సహిస్తామని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెబుతోంది. సమాజంలో విభజన తీసుకువచ్చే ఇలాంటి ప్రతిపాదనలను స్విస్ ప్రజలు ప్రోత్సహించడం తగదని ఆ సంస్థ పేర్కొంది. కానీ ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని రైట్ వింగ్ పార్టీలు చెబుతున్నాయి.

యూరోపియన్ దేశాల్లో వ్యతిరేకత
యూరోపియన్ దేశాల్లో ముస్లిం సంప్రదాయాలపై ఒకరకమైన ఫోబియా నెలకొంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో బురఖాలు, నిఖాబ్‌లపై ఆంక్షలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, నిఖాబ్‌లను ఫ్రాన్స్ 2011లోనే నిషేధించింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా ఈ చర్యను సమర్థించింది. కానీ 2018లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ బురఖాలపై నిషేధాన్ని విమర్శించింది. ఇలాంటి చర్యలు ముస్లిం మహిళల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కమిటీ తెలిపింది. నిషేధాజ్ఞల కారణంగా ఒక వర్గం మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. కానీ యూరోపియన్ దేశాలు మాత్రం ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవట్లేదు. మరిన్ని దేశాల్లోనూ ఫేస్ కవరింగ్స్‌పై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Muslim Minorities, Switzerland

తదుపరి వార్తలు