అప్ఘానిస్తాన్ (Afghanistan) తాలిబన్ల (Taliban) చేతుల్లోకి వెళ్లిన తర్వాత కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద (Kabul Airport) భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఐసిస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు (Suicide bomber attack) పాల్పడి దాదాపు 180 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఐతే ఆ కాబూల్ పేలుళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసిన సూసైడ్ బాంబర్ (ఆత్మాహుతి దళ సభ్యుడు).. అయిదేళ్ల క్రితం భారత్ అప్పగించిన ఉగ్రవాదేనని తెలిసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న మ్యాగజైన్ స్వాత్-అల్-హింద్ (swat al hind) వెల్లడించింది. కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడిచేసిన ఆ సూసైడ్ బాంబర్ బాంబర్‌ని అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రి (Abdur Rahman al-logri) గా పేర్కొంది. భారత ప్రభుత్వం అయిదేళ్ల క్రితమే అతడిని అప్ఘానిస్తాన్‌కు అప్పగించిందని ఐసిస్-కే భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్-అల్-హింద్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది.
స్వాత్-అల్-హింద్ ప్రకారం.. కశ్మీర్‌పై భారత్ వైఖరికి ప్రతీకారంగా హిందువులపై ఆత్మాహుతి దాడుల్ని జరపడానికి అల్-లోగ్రీ అయిదేళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లాడు. ఐతే నిఘా వర్గాల సమాచారంతో అతడు ఢిల్లీ పోలీసులకు పట్టబడ్డాడు. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత అతడిని అప్పగించేందుకు అమెరికా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే అల్-లోగ్రీని అప్ఘానిస్తాన్‌కు అప్పగించారు. ఆగస్టులో కాబూల్ పేలుళ్లకు పాల్పడిందని ఆ వ్యక్తేనని స్వాత్-అల్-హింద్ పేర్కొంది. అంతేకాదు అల్-లోగ్రిని ఒక వీరుడిలా..అమరుడిలా.. కీర్తించింది.
''మన సహోదరుడు అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రీ చాలా రోజుల పాటు భారత్ జైల్లో మగ్గిపోయాడు. ఆ తర్వాత అఫ్గాన్‌కు అప్పగించారు. ఐనా అతను తన ఇంటికి వెళ్లలేదు. తన ఆపరేషన్ని కాబూల్‌లో విజయవంతంగా నిర్వహించాడు. అఫ్గాన్ అధికారులు, వారి కుటుంబసభ్యులు శత్రువులతో చేతులు కలిపి దేశం విడిచి పారిపోతున్నందుకే లోగ్రి ఆత్మాహుతిదాడి చేశాడు''అని స్వాత్-అల్-హింద్ పేర్కొంది.
Romance In Flight: విమానంలో హద్దుమీరిన జంట.. పాడుపని చేస్తూ.. వీడియో వైరల్..
ఢిల్లీలోని లజ్‌పత్ నగర్లో నివాసం ఉంటున్న ఒక అఫ్గానిస్తాన్ పౌరుడిని 2017లో నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో తిరిగి అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అప్పగించాయి. స్వాత్-అల్-హింద్ చెబుతున్నట్లుగా కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడిచేసిన ఉగ్రవాది.. ఇతడే కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జైల్లో మగ్గిన అతడే.. కాబూల్ ఆపరేషన్‌ను పూర్తిచేశాడని స్వాత్-అల్-హింద్ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించినా.. ఈ విషయాన్ని ఇటు భారత్ గానీ...అటు అప్ఘాన్ ప్రభుత్వం కానీ ధృవీకరించలేదు.
Afghanistan: ఐరాస పిలుపుతో వెల్లువెత్తిన అంతర్జాతీయ సమాజం దాతృత్వం..
ఐసిస్-కే భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్-అల్-హింద్ మ్యాగజైన్.. భారత్‌కు వ్యతిరేకంగా గతంలో పలు కథనాలను ప్రచురించింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల గురించి కూడా ఒక ఎడిషన్‌ను పబ్లిష్ చేసింది. ఈ మ్యాగజైన్‌తో సంబంధమున్న దాదాపు 10 మంది ఉగ్రవాద అనుమానితులు భారత్‌లో ఇప్పటి వరకు అరెస్ట్ అయినట్లు ఎన్ఐఏ గణాంకాలు చెబుతున్నాయి.
Covid-19 deaths: అమెరికాలో మరణ మృదంగం.. ప్రతి రోజూ 2వేల మందికి పైగా మృతి
కాగా, ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఐసిస్-కే ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టు వెలుపల ఆత్మాహుతి దాడులు చేసి నెత్తుటేరులు పారించారు. ఆ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనంతరం ఐసిస్-కే స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. యూఎస్ ఆర్మీ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లుగా పెంటగాన్ కార్యాలయం వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban, Terror attack