SUDAN GOLD MINE COLLAPSE 38 PEOPLE KILLED AFTER COLLAPSE AT DEFUNCT MINE IN SUDAN SK
Gold Mine Collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
Sudan gold mine collapse: కొన్నేళ్ల క్రితం గనిని ప్రభుత్వం మూసివేసింది. బంగారం తవ్వకాలను నిలిపివేసింది. కొన్నాళ్ల తర్వాత సెక్యూరిటీని కూడా వెనక్కి పిలిచారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలు బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు
ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు (Sudan Gold Mine Collapse). వెస్ట్ కోర్టోఫన్ ప్రావిన్స్‌లోని ఫుజా ప్రాంతంలో ఉన్న దర్సాయా బంగారం గని (Darsaya Gold Mine)లో ఈ ఘటన జరిగింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలో మీటర్ల దూరంలో దర్సాయా బంగారం గని ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఐతే మూసివేసిన బంగారు గనిలో ఈ ఘటన జరిగినట్లు సూడానీస్ మినరల్ రిసోర్సెస్ మైనింగ్ కంపెనీ (Sudanese Mineral Resources Limited Company) తెలిపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మంది గాయపడ్డట్లు, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా? అని రెస్క్యూ టీమ్ గాలిస్తోంది.
కొన్నేళ్ల క్రితం దర్సాయా గనిని ప్రభుత్వం మూసివేసింది. అక్కడ బంగారం తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సెక్యూరిటీని అలాగే ఉంచారు. ఐతే కొన్ని నెలల క్రితం సెక్యూరిటీ సిబ్బందిని కూడా వెనక్కి పిలిచారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలు బంగారం కోసం ఆ గనిలో తవ్వకాలు జరిపేవారు. తరచూ గనిలోకి వెళ్లి బంగారం ఖనిజం కోసం జల్లెడ పడుతున్నారు. రిస్క్ అని తెలిసినా బంగారం కోసం ప్రాణాలను పణంగా పెట్టి గాలిస్తున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున గనిలోకి వెళ్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గనులు కూలకుండా ఉండేందుకు కనీస భద్రతా సౌకర్యాలు సైతం కల్పించలేదు. దర్సాయా మాత్రమే కాదు.. ఇలాంటి గనులు సూడాన్‌లో చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీతకు సూడాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఇక్కడ 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీశారు.
ఈ ఏడాది నవంబరులో ఇదే ఆఫ్రికాలోని నైగర్ దేశంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. గారిన్ లీమన్ బంగారం గనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులంతా బంగారం తవ్వకాల్లో బిజీగా ఉన్న సమయంలో గని గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ దుర్ఘటనలో 18 మంది మరణించారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఆఫ్రికాలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. బంగారం వెలికితీతపైనే దృష్టిపెట్టిన సంస్థలు.. కార్మికులకు భద్రతా సౌకర్యాలు కల్పిచండంలో విఫలమవుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.