Putin Warning To Ukraine : ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను, కీలక ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుని రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా దాడులకు గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ కి పుతిన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోరాటం ఆపి లొంగిపోయే దాకా, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగుతుందని పుతిన్ హెచ్చరించారు. ముందుగా రష్యా శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి ప్రయత్నించిందని.. అయితే ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పుతిన్ ఆరోపించారు. నాటో తో చేతులు కలుపుతూ ముందుకు సాగిందని అన్నారు. అందుకే తమ దేశానికి ముప్పుగా మారిన ఉక్రెయిన్ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.
మూడవ రౌండ్ శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్ కు సూచించారు. టర్కీ ప్రధాని తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. అనుకున్నట్లుగానే తమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని సైనిక స్థావరాలను నాశనం చేసినట్టు వెల్లడించారు. ఆయుధ గిడ్డంగులు, మందుగుండు సామగ్రి డిపోలు, విమానయానం మరియు వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా ఉక్రెయిన్ కు చెందిన ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేసే సైనిక మిటిటరీ మిషన్ ను రష్యా ఆచరణాత్మకంగా పూర్తి చేసిందని పుతిన్ అన్నారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన మరియుపోల్ లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని విమర్శించారు. విదేశీలను బంధీలుగా చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఉక్రెయిన్ ఇలా వ్యవహరించిందని పుతిన్ ఆరోపించారు.
ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు అధికం అవుతూనే ఉన్నాయి. రష్యాపై నాటో కూటమిలోని దేశాలతో సహా మరికొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ నుంచి ఇంధనం వరకు అన్ని రంగాలలో రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందనీ, మరో సంక్షోభం తలెత్తే అవకాశముందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే రష్యా కరెన్సీ విలువ పడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని పుతిన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin