శ్రీలంకలో పేలుళ్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఉన్నా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పేలుళ్లపై ముందస్తు సమాచారం ఉందని స్వయంగా ఆ దేశ ప్రధాని విక్రమ్‌సింఘే అంగీకరించారు. పేలుళ్లు జరుగుతాయని స్టేట్ ఇంటలిజెన్స్ శ్రీలంక పోలీసులకు ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 11న విడుదలైన ఆ లేఖ పేలుళ్లకు ఒకరోజు ముందు ప్రచారంలోకి వచ్చింది.
ఇంటలిజెన్స్ అన్ని రోజుల ముందుగానే దాడులపై హెచ్చరించినా.. ఎందుకనో పోలీసులు, ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై శ్రీలంక టెలి కమ్యూనికేషన్ మంత్రి హరిన్ ఫెర్నాండో మండిపడ్డారు. ఇంటలిజెన్స్ ముందుగానే హెచ్చరించినప్పటికీ.. ఎందుకని దాన్ని విస్మరించారని ప్రశ్నించారు.కాగా, శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన 8 పేలుళ్లలో మొత్తం 215 పైచిలుకు మంది మృతి చెందారు. దాదాపు 650 పైచిలుకు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. శ్రీలంక ప్రభుత్వ వర్గాలు మాత్రం దాడి చేసింది స్థానికులే అన్న సమాచారం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. సోషల్ మీడియాపై నిషేధం విధించారు. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack, Terrorism