SRI LANKA SUFFERING FROM FOOD CRISIS AND GOVERNMENT DECLARES FOOD EMERGENCY PRIVATE BANKS RUN OUT OF FOREIGN EXCHANGE TO FINANCE IMPORTS GH SRD
Sri Lanka Crisis: దేవుడా..! శ్రీలంక ప్రజలు పడుతున్న కష్టాలు ఎవ్వరికీ రాకూడదు..! తిండి దొరక్క..
Photo Credit : AFP
Sri Lanka Crisis: కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దీంతో 2.10 కోట్ల జనాభా ఉన్న ద్వీప దేశం లంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిత్యావసర సరుకుల కోసం ఆ దేశ ప్రజలు తంటాలు పడుతున్నారు.
శ్రీలంక (Sri Lanka)లో ఆహార కొరత (Food Crisis) తాండవిస్తోంది. సమస్య తీవ్రత నానాటికీ పెరుగుతోంది. సంక్షోభం జఠిలమవుతోంది. నిత్యావసర సరుకుల కోసం ఆ దేశ ప్రజలు తంటాలు పడుతున్నారు. పాలపొడి, పంచధార, వంట నూనెలు కొనేందుకు జనాలు షాపుల ముందు క్యూలు కడుతున్నారు. నిత్యావసరాల కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో శ్రీలంక ప్రభుత్వం (Sri Lanka Government) ఆహార ఎమర్జెన్సీని ప్రకటించింది. పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ కింద లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఫుడ్ ఎమర్జెన్సీని (Sri Lanka President Gotabaya Rajapaksa) ప్రకటించారు. వ్యాపారులు నిత్యావసరాలను స్టాక్ చేస్తే నిల్వ చేస్తే సీజ్ చేసి, వారిని అరెస్ట్ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దిగుమతి పన్ను, కస్టమ్స్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం, పంచధార సహా నిత్యావసరాల సరుకులను విక్రయించాలని ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించేందుకు మేజర్ జనరల్‌ను అధ్యక్షుడు నియమించారు.
సంక్షోభానికి కారణమేంటి?
శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు తీవ్రంగా పడిపోయాయి. ప్రైవేటు బ్యాంకుల వద్ద కూడా విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం శ్రీలంకకు కష్టంగా మారింది. దేశంలోని ఆహార నిల్వలు పడిపోయాయి. దీంతో ప్రజలకు నిత్యావసరాల దొరకడం కష్టంగా మారింది. కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దీంతో 2.10 కోట్ల జనాభా ఉన్న ద్వీప దేశం లంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
మరోవైపు బాండ్ల విక్రయంలోనూ సెంట్రల్ బ్యాంకు విఫలమవుతోంది. జూలై 2021 చివరి నాటికి శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. నవంబర్ 2019న 7.5 బిలియన్ డాలర్లు ఉండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా భారీ వాణిజ్య లోటు కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తోంది.
విదేశీ మారక ద్రవ్యాల నిల్వను కాపాడుకునేందుకు విదేశాల్లో తయారైన టూత్ బ్రష్ హ్యాండుళ్లు, సుగంధ ద్రవ్యాలు, వెనెటియన్ బ్లెండ్స్, స్ట్రాబెర్రీలు, వెనిగర్, వెట్ వైప్స్, పంచధార లాంటి అనేక వస్తువులను దిగుమతి చేసుకోవడం గతేడాదే శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. దిగుమతుల నియంత్రణ దారుణంగా పడిపోవడం 1970ల తర్వాత ఇప్పుడు మరోసారి జరిగింది.
ప్రధానంగా శ్రీలంకకు పర్యాటకం ద్వారానే ఎక్కువగా విదేశీ మారకం వస్తుంది. అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడడంతో లంకకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. విదేశీ మారకం తగ్గిపోయింది. శ్రీలంక ఇంకా 1.5 బిలియన్ డాలర్ల విదేశీ మారకం రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇది మరింత భారంగా మారనుంది. అలాగే డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ దాదాపు 20 శాతానికి పైగా పడిపోయింది. దీంతో కష్టాలు అధికమయ్యాయి.
ఇదే తరుణంగా దేశంలో కరోనా ప్రభావం పెరుగుండడంతో మరోసారి 16 రోజుల కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ప్రజలు నిత్యావసరాల కోసం బారులు తీరారు. అసలే నిత్యావసరాల కొరతతో దేశం అల్లాడుతుంటే ఈ కర్ఫ్యూ శ్రీలంక ప్రజలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. మరోవైపు కరోనా మహమ్మారి కాలంలో వడ్డీరేట్లను పెంచిన ఏకైక ఆసియా దేశంగా శ్రీలంక నిలిచింది. ట్రెజరీ బిల్ వేలంలో విఫలమయ్యాక ఆ దేశ సెంట్రల్ బోర్డు వడ్డీ రేట్లను 6 శాతానికి పెంచింది.
ఆ తర్వాత గత నెల 29 బిలియన్ల శ్రీలంక రూపాయలను ప్రభుత్వం ప్రింట్ చేసింది. స్టాటుటరీ నిల్వ శాతాన్ని కూడా 2 నుంచి 4 శాతానికి పెంచింది. ఆగస్టు 30న నిర్వహించిన శ్రీలంక రూపాయల బాండ్ వేలం కూడా విఫలమైంది. మరోవైపు కరెన్సీని ఎక్కువగా ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.