SRI LANKA PRESIDENT AGREES TO REMOVE PM MAHINDA RAJAPAKSA AMID CRISIS PVN
Sri Lanka : సంక్షోభం వేళ శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం..ప్రధాని తొలగింపు!
మహింద రాజపక్స(ఫైల్ ఫొటో)
Sri Lanka PM Mahinda Rajapaksa: పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఏ మాత్రం చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Sri Lanka PM Mahinda Rajapaksa: పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఏ మాత్రం చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఓ వైపు నిత్యావసరాల కొరత, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమంతో లంక అట్టుడుకుతోంది. 2.19 కోట్ల జనాభా కలిగిన ద్వీప దేశం శ్రీలంక(Sri Lanka)లో సుదీర్ఘమైన విద్యుత్ కోతలు,మందులు, ఇంధనం మరియు ఇతర వస్తువుల కొరతపై ఆగ్రహం వ్యక్తం నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ, ప్రధానమంత్రి మహింద వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి. గత ఇరవై ఏళ్లుగా శ్రీలంకను శాసిస్తోన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానమంత్రి మహింద రాజపక్స(Mahinda Rajapaksea) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కార్మిక సంఘాలు గురువారం సమ్మె చేపట్టాయి. వైద్య రంగంతో పాటు పోర్టులు, విద్యుత్, విద్య, పోస్టల్ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీగా పాల్గొని రాజపక్స సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంక్షోభాలకు బాధ్యులైన రాజపక్స సోదరులు అధికారం నుంచి తక్షణమే దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. తాము మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇద్దరు నేతలు ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. అయితే నిరసనలు ఉద్ధృతమవుతున్న వేళ శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మహింద రాజపక్సను తొలగించి ఆయన స్థానంలో వేరొకరని నియమించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సిద్ధమైనట్లు శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు.
నూతన ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు నేషనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నారని, అంతేకాకుండా అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త కేబినెట్ ఏర్పాటు చేయనున్నారని మైత్రిపాల సిరిసేన తెలిపారు. సంక్షోభ పరిస్థితులపై శుక్రవారం అధ్యక్షుడు గొటబాయతో చర్చించిన అనంతరం సిరిసేన ఈ విషయాలు వెల్లడించారు. శ్రీలంకలో అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు అధికార కూటమిలోని 11 పార్టీలతో అధ్యక్షుడు గొటబాయ సమావేశం తలపెట్టారు. అయితే, అధ్యక్షుడి సోదరుడైన ప్రధానమంత్రి మహింద రాజపక్స, ప్రస్తుత కేబినెట్ మంత్రులు ఈ భేటీకి దూరంగా ఉంటేనే తాము ఈ సమావేశానికి హాజరవుతామని విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అధ్యక్షుడు గొటబాయతో మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మార్పు గురించి గొటబాయ మైత్రిపాలకు తెలిపారు. అధికార కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన 40మందికిపైగా సభ్యుల్లో మైత్రిపాల సిరిసేన ఒకరు. అయితే, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధానమంత్రి మహింద రాజపక్స చెప్పిన రెండు రోజుల్లోనే ఆయనను మార్చేందుకు అధ్యక్షుడు సిద్ధం కావడం గమనార్హం. కాగా, ఇప్పటికే రాజపక్స కుటుంబానికి చెందిన పలువురు మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహింద కూడా పదవి వీడితే అధ్యక్షుడు మినహా శ్రీలంక ప్రభుత్వానికి రాజపక్స కుటుంబం మొత్తం దూరమైనట్లే.
కాగా,ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత దీన స్థితిలోకి నెట్టాయి. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టింది. పన్నులు రద్దు చేసి.. ఆదాయం లేక అప్పుల మీద అప్పులు చేసి... ఉచిత సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేసి చేతులు కాల్చుకుంది. ఫలితంగా దేశ ఆదాయం కన్నా ఖర్చులు రెట్టింపయ్యాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై కరోనా ప్రభావం చూపించడంతో శ్రీలంకపై కోలుకోలేని దెబ్బ పడింది. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. అప్పులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకింది. నిత్యావసర వస్తువులను సైతం దిగుమతి చేసుకోలేని స్థితికి చేరుకుంది. 2021లో శ్రీలంక ప్రభుత్వం కెమికల్ ఫర్టిలైజర్స్పై నిషేధం విధించి రైతాంగాన్ని బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు నెట్టడంతో దేశంలో ఆహార ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో తిండికి కూడా కొరత ఏర్పడే పరిస్థితి దాపురించింది.
సాధారణంగా ఏ దేశాలైనా అప్పుల కోసం ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, జపాన్ బ్యాంక్, సింగపూర్ బ్యాంక్‌లను ఆశ్రయిస్తుంటాయి. చౌక వడ్డీతో పాటు రుణ చెల్లింపు గడువు 30-50 ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి సులువుగా అప్పులు తీర్చవచ్చునని భావిస్తాయి. కానీ శ్రీలంక ప్రభుత్వం కమర్షియల్ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకుని.. వాటిని చెల్లించలేక మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఓవైపు అప్పులు చెల్లించేందుకు... మరోవైపు నిత్యావసర వస్తువుల దిగుమతి కోసం డబ్బులు లేకపోవడంతో ధరల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు నిజంగానే ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు వెనెజులా కూడా దేశ ప్రజలపై ఉచిత పథకాలు కుమ్మరించి చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థితికి చేరుకుంది. ఆ సంక్షోభం నుంచి ఇప్పటికీ ఆ దేశం కోలుకోవట్లేదు. జేపీ మోర్గాన్ నివేదిక అంచనాల ప్రకానం.. ఈ ఏడాది శ్రీలంక స్థూల అప్పులు 7 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముంది. ఇక ద్రవ్యలోటు కూడా 3 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చి నాటికి లంక విదేశీ మారక నిల్వలు 1.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.