SRI LANKA IMPOSES 36 HOUR LOCKDOWN TO CONTROL PEOPLE PROTESTS OVER FOOD FUEL CRISIS HOURS AFTER EMERGENCY MKS
Lockdown: మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్.. తిండి దొరక్క రోడ్డెక్కిన జనం.. శ్రీలంకలో అల్లకల్లోలం
ప్రజల నిరసనలు
భారత్ పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. ఆహార, ఆర్థిక సంక్షోభం కారణంగా తిండి, సరుకులు దొరక్క జనం రోడ్లెక్కారు. వాళ్లను అణిచేయడానికి ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం, ఇప్పుడు లాక్ డౌన్ కూడా ప్రకటించింది..
భారత్ కు సమీపంగా ఉంటూ చరిత్రనూ పంచుకునే శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. ధరల పెరుగుదలగా మొదలైన ఆర్థిక సంక్షోభం రెండు వారాల్లోనే దేశం మొత్తాన్ని దారిద్ర్యంలోకి నెట్టేసింది. ఆహార సంక్షోభం కారణంగా తిండి దొరక్క జనం విలవిల్లాడుతున్నారు. ఎటైనా పోదామన్నా డీజిల్ లేక రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దిక్కుతోచని జనం ప్రభుత్వంపై ఆందోళనకు దిగగా, వాళ్లను అణిచివేయగానికి శ్రీలంక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కరోనా విలయం తర్వాత ప్రపంచ దేశాల్లో చోటుచేసుకున్న తొలి లాక్ డౌన్ శ్రీలంకలోనే కావడం గమనార్హం.
శ్రీలంకలో కొంతకాలంగా నెలకొన్న ఆహార, ఆర్ధిక సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటాయి. కాగితం కొరతతో పరీక్షలు వాయిదాపడ్డాయి. నిల్వలు అయిపోవడంతో డీజిల్ విక్రయాలు నిలిపేశారు. ఉత్పత్తి లేక రోజుకు 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ దుస్థితిపై ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేస్తుండటంతో రాజపక్స్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించింది. 24 గంటలు తిరిగేలోపే లాక్ డౌన్ కూడా ప్రకటించింది.
శ్రీలంక నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రిదాటిన తర్వాత ఈ మేరకు గెజిట్ జారీ అయింది. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ విధించి 24 గంటలు తిరక్కముందే లాక్ డౌన్ ప్రకటించారు. జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు చేస్తున్న క్రమంలో వారు వీధుల్లోకి రాకుండా 36గంటల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించేవారిని జైళ్లకు తరలిస్తే అక్కడ తిండిపెట్టలేని పరిస్థితి. మరి నిరసనకారుల్ని సైన్యం ఎలా డీల్ చేయబోతోందనేది కీలకంగా మారింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.