ఊహించని ఆర్థిక సంక్షోభం(Crisis)తో 2 కోట్ల 20 లక్షల జనాభా ఉన్న ద్వీప దేశం శ్రీలంక (Srilanka) ఉక్కిరిబిక్కిరవుతోంది. విదేశీ మారక నిల్వలు $1.6 బిలియన్లకు పడిపోయాయి. దిగుమతులకు డబ్బు(Money) చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం ఆహార వస్తువులు సహ అనేక నిత్యావసర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల కారణంగా రోజుకు మూడు పూటల తిండి తినలేకపోతున్నామని అక్కడి కుటుంబాలు వాపోతున్నాయి. రోజు కూలీ పని చేసుకొని పొట్టపోసుకునేవారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు(Prices) పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం (Srilanka Government) ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దిగుమతుల ఆంక్షలు, పెరుగుతున్న ఇంధనం, రవాణా ఛార్జీల కారణంగా పాల పొడి, బియ్యం వంటి అత్యవసర వస్తువుల ధరలు కొండెక్కాయి. గత నాలుగు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రెట్టింపు అయింది. సిలిండర్ ధర విపరీతంగా పెరగడంతో చాలా మంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ధరల పెరుగుదల పరిస్థితి ఒక్క శ్రీలంకకే పరిమితం కాలేదు. భారత్, పాకిస్థాన్, మాల్దీవులు వంటి దేశాల్లోనూ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ప్రజలు చవిచూస్తున్నారు. చిన్న ద్వీప దేశం కావడంతో శ్రీలంకలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ దేశంలోని డెయిరీ పరిశ్రమ స్థానిక అవసరాలు తీర్చలేదు కాబట్టి, పాలపొడిని శ్రీలంక దిగుమతి చేసుకుంటుంది. శ్రీలంక రాజధాని కొలంబోని కొన్ని దుకాణాల్లో క్యారెట్, బీట్‌రూట్, ఆకు కూరలు జోరుగా అమ్ముతారు. కొనుగోలుదారులు ధరలు తగ్గించాలని జోరుగా బేరమాడుతున్నారు. ధరలు తగ్గని పరిస్థితుల్లో కొనాల్సిన మొత్తాన్ని తగ్గించుకుంటున్నారు.
భారీ సంక్షోభం
పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం తమ నెల జీతంతో రెండు వారాలకు మించి మనుగడ సాగించలేమని ఉద్యోగులు వాపోతున్నారు. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రేషన్ షాపుల దగ్గర భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. భవిష్యత్‌పై ఆశ లేకుండా పోయిందని చాలా మంది నిట్టూర్చుతున్నారు. అనేక నిత్యావసర వస్తువులకు డిమాండ్ భారీగా పెరగడంతో శ్రీలంకలో ఆహార పదార్థాల ధర గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 21.1% పెరిగింది. పాలపొడి ధర 12.5% పెరగడంతో శ్రీలంకలోని కేఫ్ ఓనర్ల సంఘం టీ విక్రయాలు పూర్తిగా ఆపేయాలని నిర్ణయించింది. ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే టీ అమ్మాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు.
దెబ్బతిన్న పర్యాటకం
శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. కొవిడ్ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక $ 4బిలియన్లు ఆర్జించింది. ఇప్పుడు మహమ్మారి కారణంగా అది 90% వరకు పడిపోయింది. తమ దగ్గర కూడా ఎటువంటి ఆప్షన్స్ లేవని శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యతాయుత ప్రభుత్వంగా తాము నెట్టుకొస్తున్నామని శ్రీలంక మంత్రి షేహాన్ సెమెసింగే అన్నారు. మరో వైపు భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలపై శ్రీలంకలోని విపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. ఉత్పత్తి చేస్తున్నదానికంటే ఎక్కువ వినియోగిస్తున్నామని ఆర్థిక సంస్కరణల మాజీ మంత్రి, విపక్ష ఎంపీ హర్షా డి సిల్వా ఆరోపించారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
పెరుగుతున్న ధరలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే $1బిలియన్ ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పెంచింది. పేదలకు కొంత ఆర్థిక చేయూత అందించడంతో పాటు కొన్ని ఆహార వస్తువులు, ఔషధాల ధరలపై పన్నులు తొలగించింది. అటు అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 2020లో యూరోప్ నుంచి ఆసియా దేశాలకు ఒక ప్రామాణిక కంటెయినర్ పంపించేందుకు అయ్యే షిప్పింగ్ ఖర్చు $ 2000 ఉండగా అది గత సంవత్సరం $10000కు పెరిగింది.
భారీగా పెరిగిన సరుకు రవాణా రేట్లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ UNCTAD హెచ్చరించింది. దిగుమతుల కోసం పూర్తిగా సముద్ర రవాణాపైనే ఆధారపడే శ్రీలంక వంటి చిన్న ద్వీప దేశాలు తట్టుకోలేమని తెలిపింది. గతంలో జరిగిన ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు తీవ్రమైన ముప్పుగా మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు లంక ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా బెడిసి కొట్టడంతో ఆ దేశం పరిస్థితి దుర్భరంగా మారింది.
ఇతర దేశాలపై కూడా ప్రభావం
పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా రవాణా సంస్థలు ఛార్జీలు పెంచడంతో ఆ ప్రభావం హోల్‌సేల్ ధరలపై కనిపిస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో భారతదేశ హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేని రీతిలో 14.2% నికి పెరిగింది. పొరుగుదేశం పాకిస్థాన్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 12.3 శాతానికి పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఇదే అత్యధికం.
గడిచిన ఏడాదితో పోలిస్తే అంతర్జాతీయ ఆహార ధరల సూచి 2021లో 28% పెరిగిందని ఆహారం, వ్యవసాయ సంస్థ (FAO) డేటా చెబుతోంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, అంతర్జాతీయంగా కొనసాగుతున్న మహమ్మారి పరిస్థితులు, అనిశ్చితితో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా 2022లో స్థిరమైన మార్కెట్ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Srilanka