అధిక ధరల దెబ్బకు స్వదేశీయులు విలవిల్లాడుతున్నా గొప్ప ఔదార్యంతో భారత్ భారీ సాయాన్ని అందించిన తర్వాత కూడా శ్రీలంకలో పరిస్థితులు మారలేదు. ద్వీపదేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పరిణామాలు మరింత దిగజారిన క్రమంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయడం ఖాయంగా మారింది. ఆదివారం రాత్రి కొలంబోలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ప్రధాని మహీంద తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబోయ రాజపక్సకు పంపారని తెలుస్తోంది. అయితే, ప్రధాని మార్పు వల్ల ప్రస్తుత పరిస్థితో మార్పు వస్తుందా? అంటే కష్టమేననే సమాధానం వినిపిస్తోంది. అయితే, రాజీనామా వార్తలను రాజపక్స కార్యాలయం తోసిపుచ్చింది.
ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆహారపానీయాలు దొరక్క జనం విలవిల్లాడుతున్నారు. కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది. ఈ దుస్థితిపై దేశ ప్రజలు దాదాపు తిరుగుబాటు చేయగా, వాళ్లను అణిచివేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్త ఎమర్జెన్సీ, దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించింది. అయినాసరే, ఆంక్షలను లెక్కచేయకుండా ఆదివారం కూడా ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు.
వందలాది మంది విద్యార్థులు ఆదివారం కొలంబోలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, విద్యార్థులను చెదరగొట్టేందుకు స్థానిక పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రస్తుతం శ్రీలంకలోని సగటు మనిషికి ఆహారం, ఇంధనంతో పాటు నిత్యవసరాల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతన్నాయి. ప్రధాని గద్దె దిగాలనే డిమాండ్ తో జనం ఉద్యమిస్తుండటంతో రాజపక్స్ దిగిరాక తప్పలేదు. అయితే, ప్రధాని రాజీనామా చేశారన్న లేదా చేయబోతున్నారన్న వార్తలను రాజపక్స్ కార్యాలయం తోసిపుచ్చింది.
శ్రీలంకలో తాజా ఆర్థిక సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ ఆ వాదనను ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. అందరినీ ఆకలిలోకి నెట్టేసిన పాపం మీదేనంటూ ప్రధాని రాజపక్సపై జనం మండిపడుతున్నారు. సంక్షోభ శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని, వేల క్వింటాల బియ్యాన్ని పంపింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.