భారత్ పొరుగు దేశం శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. విదేశాల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేమని చేతులెత్తేసిన రాజపక్స ప్రభుత్వం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఇచ్చే ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఆలోపు దేశంలో ఆకలి బాధలు కొంతైనా తీర్చగలిగేలా డబ్బులు పంపాలంటూ ప్రవాసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. అయితే, విదేశాల్లో నివసిస్తోన్న శ్రీలంకన్లు మాత్రం సొంత ప్రభుత్వంపై నమ్మకం లేదని, సాయంగా డబ్బులు పంపినా సరిగా వాడుతారో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలో దుస్థితిపై నిరసనలు మరింత ఉధృతం అయ్యాయి. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో నిరసనకారులతో చర్చలకు సిద్దమని ప్రధాని మహీంద రాజపక్స ప్రకటించారు. వివరాలివే..
ప్రజల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఆహారం కొరత శ్రీలంకను అతలాకుతలం చేస్తున్నది. బియ్యం, పప్పులు సహా అన్ని నిత్యావసర సరుకుల నిల్వలు నిండుకోడం, ధరలు భారీగా పెరగడంతో తిండికి లేక జనం విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే దివాళా తీసిన శ్రీలంక ప్రభుత్వం.. బయటి నుంచి వచ్చే సాయంపైనే ఆదారపడుతోంది. భారత్ నుంచి శ్రీలంకకు బియ్యం, ఇంధనం రుణంగా అందుతున్నా, అక్కడి అవసరాలకు ఇది సరిపోవడంలేదు. ఐఎంఎఫ్ ప్యాకేజీ ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న శ్రీలంక జాతీయులు డబ్బులు విరాళంగా పంపాలంటూ ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.
శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘే ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన చేశారు. విదేశాల్లో ఉంటున్న శ్రీలంక జాతీయులు ఈ కష్టకాలంలో విదేశీ మారక ద్రవ్యాన్ని విరాళంగా ఇవ్వాలని, మాతృదేశాన్ని ఆదుకోవాలని కోరారు. విరాళాల కోసం అమెరికా, బ్రిటన్, జర్మనీలలో బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. ప్రవాసులు పంపే డబ్బులను ఆహారం, ఇంధనం, మందులు వంటి చాలా అవసరం ఉన్న అంశాలకు మాత్రమే ఉపయోగిస్తామని సెంట్రల్ బ్యాంకు గవర్నర్ వీరసింఘే హామీ ఇచ్చారు.
కాగా, విదేశాల్లోని శ్రీలంక జాతీయులు మాత్రం తమ స్వదేశ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు. సహాయపడటానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వాన్ని తాము నమ్మలేమని, డబ్బులు కచ్చితంగా తిండి, మందులకే వాడుతారనే నమ్మకంలేదని అంటున్నారు. 2004 సునామీ విపత్తు సమయంలో విదేశాల నుంచి భారీగా విరాళాలు పంపామని, ఆ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు కూడా సక్రమంగా వినియోగిస్తారనే విశ్వాసం లేదని ప్రవాసులు చెబుతన్నారు. ఇదిలా ఉంటే,
దేశ ప్రజలకు తిండి అందించేందుకు విదేశాల్లోని పౌరులను విరాళాలు అడుక్కుంటోన్న శ్రీలంక ప్రభుత్వం స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. సోదరులైన గొటబయ రాజపక్స, మహీంద రాజపక్స శ్రీలంక అధ్యక్ష, ప్రధాని పదవుల నుంచి దిగిపోవాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. మిత్రపక్షం మద్దతు ఉపసంహరణ తర్వాత ఇప్పటికే మైనార్టీలో పడిన రాజపక్స సర్కారును పూర్తిగా కూలదోసే దిశగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నాయి. తాజా పరిణామంగా శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స తాను నిరసనకారులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Financial crisis, Food crisis, Sri Lanka