Home /News /international /

SRI LANKA CRISIS GOTABAYA RAJAPAKSA DEPARTS FROM MALDIVES ON WAY TO SINGAPORE AS COUNTRY UNDER TURMOIL SK

Sri Lanka: దేశం నుంచి పారిపోయినా రాజీనామా చేయని గొటబాయ.. నెక్ట్స్ ఏం జరగనుంది?

గొటబాయ రాజపక్స

గొటబాయ రాజపక్స

Sri Lanka Crisis: ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అధ్యక్ష పదవికి జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ.. ఇప్పటి వరకూ ఆ పని చేయలేదు. దేశం దాటిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.

    శ్రీలంక ఆర్థిక సంక్షోభ (Srilanka Crisis) ఊబిలో మునిగిపోయి.. ప్రజలు అల్లాడిపోతుంటే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. నిన్న ఉదయం ప్రత్యేక యుద్ధ విమానంలో మాల్దీవులకు వెళ్లిన ఆయన ఫ్యామిలీ.. అక్కడే ఉంటే సేఫ్ కాదని.. ఇప్పుడు సింగపూర్‌కి (Singapore)  వెళ్లిపోయారు. అక్కడి నుంచి సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జెడ్డాకు వెళ్తారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అధ్యక్ష పదవికి జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ.. ఇప్పటి వరకూ ఆ పని చేయలేదు. దేశం దాటిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా అందిన వెంటనే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జన బలవేగయ పార్టీకి యోచిస్తోంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని సాజిత్ ప్రేమదాస (Sajith premadasa) భావిస్తున్నారు. ఒకవేళ గొటబాయ రాజపక్సే రాజీనామా చేయకుంటే ఏం చేయాలన్న దానిపై పార్లమెంట్ స్పీకర్ మహింద అభేవర్ధనే సమాలోచనలు చేస్తున్నారు.



    మరోవైపు దేశ రాజధాని కొలంబోలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని కార్యలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు.. ఇప్పుడు కొన్ని చోట్ల ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో పౌరులెవరూ ప్రైవేట్ ఆస్తుల జోలికి పోవద్దని అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరుమాన ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఐనప్పటికీ చాలా చోట్ల ఆందోళనకారులు రోడ్లపైనే ఉండడంతో.. వారిని అడ్డుకునేందుకు కొలంబోలో కర్ఫ్యూ విధించింది.ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలని.. బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయాలని సైన్యానికి ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే సూచించారు. వారికి పూర్తి అధికారాలను కట్టబెట్టారు.



    కొలంబో నగరం నివురు గప్పిన నిప్పులా ఉంది. ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి కూడా చొచ్చుకెళ్లారు. ప్రధాన మంత్రి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని బయటకు తరలించేందుకు పోలీసులు, ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. కొందరిపై లాఠీచార్జ్ చేశారు. ఐనప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లంకలో ఈ పరిస్థితి రావడానికి గొటబాయ రాజపక్సతో పాటు విక్రమసింఘే ఓ కారణమని మండిపడుతున్నారు. లంకలో తాజా పరిస్థితులను భారత్‌తో పాటు ఐక్యరాజ్య సమితి కూడా నిశితంగా గమనిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gotabaya Rajapaksa, International news, Sri Lanka, Srilanka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు