శ్రీలంకలో పరిస్థితులు (Srilanka Crisis) అంతకంతకూ దిగజారుతున్నాయి. దేశం నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa)ఇంకా అధ్యక్ష పదవికి రాజీనామా లేదు. నిన్న ఉదయం కొలంబో నుంచి మాల్దీవుల(Maldives)కు వెళ్లిన ఆయన.. ఇవాళ సింగపూర్(Singapore)కు చేరుకున్నారు. గొటబాయ వెంట ఆయన భార్య, ఇద్దరు బాడిగార్డ్స్ కూడా ఉన్నారు. అక్కడి నుంచి సౌదీలోని జెడ్డాకు వెళ్తారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆ నిర్ణయాన్ని గొటబాయ విరమించుకున్నారని.. సింగపూర్‌లోనే ఉంటారని తాజా సమాచారం అందుతోంది. ఐతే ఆయన రాజీనామా చేయకపోవడంతో.. లంకలో తదుపరి ఏం జరగబోతోంది? కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారని.. ఆసక్తి రేపుతోంది. ఒకవేళ గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) రాజీనామా చేయకుంటే.. చట్టప్రకారం తదుపరి ఏం చేయాలన్న దానిపై పార్లమెంట్ స్పీకర్ రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడికి సంబంధించి రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీ జన బలవేగయ పార్టీకి భావిస్తోంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని సాజిత్ ప్రేమదాస (Sajith premadasa) యోచిస్తున్నారు. తాజాగా మరో పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్, ఎంపీ ఫీల్డ్ మార్షల్ శరత్ ఫొన్సెకా కూడా రేసులో ఉన్నారు. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న శ్రీలంక పొదుజన పెరుమాన పార్టీ (SLPP) కూడా తనకు మద్దతు ఇస్తోందని అన్నారు. ఒకవేళ మెజారిటీ ఎంపీలు తనను ఎన్నుకుంటే.. ఖచ్చితంగా అధ్యక్ష బాధ్యతలు చేపడతానని చెప్పారు. శుక్రవారం రోజు కొత్త ప్రధాని పేరు ప్రతిపాదిస్తామని విపక్ష నేతలు చెబుతున్నారు.
ఇక కొలంబోలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు ప్రధాని విక్రమ్‌సింఘే. దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయాలని సైన్యానికి సూచించారు వారికి పూర్తి అధికారాలను ఆయన కట్టబెట్టారు. నిన్నటి వరకు అధ్యక్ష భవనం, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, పార్లమెంట్‌ను ముట్టడించి.. వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆందోళనకారులు.. ఇవాళ్టి నుంచి ఆ పని చేయబోమని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిక భవనాలను స్వాధీనం చేసుకోబోమని స్పష్టం చేశారు. తమను కష్టాలను నుంచి గట్టెక్కించే ప్రభుత్వం వస్తే చాలని.. అంతకుమించి తాము ఏమీ కోరుకోవడం లేదని తెలిపారు.
మరోవైపు లంక సంక్షోభంలో భారత్ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. భారత్ సహకారం వల్లే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయనకు భారత సైన్యం అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఐతే ఆ ప్రచారాన్ని కొలంబోలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, International news, Sri Lanka, Srilanka