Home /News /international /

SRI LANKA CRISIS DINESH GUNAWARDENA APPOINTED AS PM OF SRILANKA HIS PARENTS FOUGHT FOR INDIA INDEPENDENCE SK

Sri Lanka: లంక కొత్త ప్రధానిగా గుణవర్దన.. భారత స్వాతంత్య్రం కోసం ఈయన తండ్రి పోరాటం

శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్దన ప్రమాణ స్వీకారం

శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్దన ప్రమాణ స్వీకారం

Sri Lanka Crisis: శ్రీలంకలో సోషలిజం పితామహుడిగా పేరున్న ఫిలిప్ గుణవర్ధన కుమారుడే ఈ దినేష్ గుణవర్ధన. ఫిలిప్ గుణవర్ధన విస్కాన్సిన్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ, వీకే కృష్ణమీనన్‌కు క్లాస్ మేట్‌గా ఉన్నారు.

    శ్రీలంక (Srilanka) కొత్త ప్రధానిగా  శ్రీలంక పొదుజన పెరుమాన (SLPP) పార్టీ నేత దినేష్ గుణవర్ధన (Dinesh Gunawardena) నియమితులయ్యారు. ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రీలంక 15వ ప్రధాన మంత్రిగా దినేష్ గుణవర్ధన బాధ్యతలను చేపట్టారు. కాగా, లంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే (Ranil Vikramasinghe) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇవాళ కేబినెట్ ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చించిన తర్వాత.. ప్రధాని బాధ్యతలను సీనియర్ నాయకుడైన దినేష్ గుణవర్ధనకు అప్పగించారు.  ఈయన రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. గతంలో విదేశాంగ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  ఈ ఏడాది ఏప్రిల్ అప్పటి అధ్యక్షుడు గొటబాట రాజపక్స (Gotabaya Rajapaksa).. దినేష్ గుణవర్ధనను హోమంత్రిగా నియమించారు. ఆయనే ఇప్పుడు ప్రధాన మంత్రి అయ్యారు.

    శ్రీలంకలో సోషలిజం పితామహుడిగా పేరున్న ఫిలిప్ గుణవర్ధన కుమారుడే ఈ దినేష్ గుణవర్ధన. ఫిలిప్ గుణవర్ధన విస్కాన్సిన్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ, వీకే కృష్ణమీనన్‌కు క్లాస్ మేట్‌గా ఉన్నారు. దినేష్ గుణవర్ధన తల్లిదండ్రులు.. కుసుమ, ఫిలిప్ గుణవర్ధనలకు భారత్‌తో సత్సంబంధాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటిష్ కాలనీగా ఉన్న శ్రీలంక నుంచి పారిపోయి.. వీరిద్దరు ఇండియాకు వచ్చారు. అదే సమయంలో మనదేశంలో స్వాతంత్య్ర పోరాటం జరుగుతోంది. ఆ పోరాటంలో వీరు పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే 1943లో బ్రిటిష్ సైన్యం పట్టుకొని.. ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో బంధించింది. ఏడాది తర్వాత వారిని శ్రీలంకకు డిపోర్ట్ చేశారు. అక్కడ కూడా జైల్లోనే గడిపారు. రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాతే జైలు నుంచి విడుదలయ్యారు. అప్పట్లో దక్షిణాసియా ప్రజలంతా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో భాగంగానే ఫిలిప్ గుణవర్ధన భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.



    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన నేపథ్యంలో.. మొదట మహింద రాజపక్స ప్రధాని మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘేకి ప్రధానమంత్రి బాధ్యతలను అప్పజెప్పారు. ఐతే మళ్లీ గత 15 రోజులుగా లంకలో ఆందోళనలు మిన్నంటాయి. ఏకంగా అధ్యక్ష భవనం, ప్రధాని నివాసంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. అనంతరం పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్.. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అయన అధ్యక్ష పదవి చేపట్టడంతో.. ప్రధాని పదవి మళ్లీ ఖాళీ అయింది. ఈ క్రమంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధనకు ప్రధాని బాధ్యతలను అప్పజెప్పారు రణిల్ విక్రమసింఘే. మరి కొత్త ప్రభుత్వంలోనైనా లంక కష్టాలు తీరుతాయా? లేదో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Sri Lanka, Sri Lanka Crisis

    తదుపరి వార్తలు